చెన్నకేశవస్వామి పాదాలను స్పృశించిన సూర్య భగవానుడు.. Chennakesava swamy Temple : బాపట్ల జిల్లా జె.పంగులూరు మండలం చందలూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భూనీలా సమేత చెన్నకేశవ స్వామి వారి దేవాలయం నందు సూర్యకిరణాలు మూలవిరాట్ పాదాలను తాకాయి. ఈ దేవాలయం సుమారుగా 500 సంవత్సరాల క్రితం నిర్మించినట్లు అర్చకులు తెలిపారు. 15వ శతాబ్దంలోని విజయనగర సామ్రాజ్యధీశులు అచ్యుత రాయలు కాలంలో నిర్మించబడిన ఆలయంగా చెప్పవచ్చు. అప్పటి నుంచి పూజలు జరిగేవని తెలిపారు. కాలక్రమేపి స్వామి వారి కైంకర్యాలను నిర్విరామంగా 26 సంవత్సరాల నుంచి తాను నిర్వహిస్తున్నట్లు పూజారి తెలిపారు.
చందలూరు గ్రామ ప్రజలు, భక్తుల సహాయ సహకారాలతో 2017వ సంవత్సరం నుంచి ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్విరామంగా సాగుతున్నాయి. ప్రతి ఏటా ధనుర్మాసంలో కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు జరుగుతాయని తెలిపారు. ప్రతి సంవత్సరం తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ రోజున పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సంవత్సర కాలంలో రెండు పర్యాయములు అనగా ఉత్తరాయణం, దక్షిణాయణంలలో సూర్యకిరణాలు మూలవిరాట్ చెన్నకేశవ స్వామివారి పాదాలను తాకుతాయి.
ప్రతి సంవత్సర సౌరమాన ప్రకారం ఉత్తరాయణంలోని కుంభ సంక్రమణంలో శతభిషం కార్తెలో అనగా ప్రతి ఏడాది ఫిబ్రవరి 27, 28వ తేదీలలో ఉదయం 6 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల 55 నిమిషాలు వరకు సూర్యకిరణాలు "ఆపాద మస్తకం " అనగా స్వామివారి తల నుండి పాదాల వరకు తాకుతాయని, ఇదే క్రమంలో దక్షిణాయంలోని కన్య సంక్రమణంలో చిత్తకార్తెలో అక్టోబర్ 14, 15వ తేదీలలో ఉదయం ఆరు గంటల ఐదు నిమిషాల నుంచి 6 గంటల 30 నిమిషాల వరకు చెన్నకేశవ స్వామివారి మూలవిరాట్నకు సూర్యకిరణాలు అభిషేకిస్తూ తాకుతాయని ఆలయ అర్చకులు తెలిపారు. ఇలాంటి అరుదైన దృశ్యాలు కనులారా చూడటం ఎంతో ఆనందదాయకమని భక్తులు కొనియాడారు.
ఈ దేవాలయం విజయనగర సామ్రాజ్యధీశులు అచ్యుత రాయలు కాలంలో నిర్మించినట్లుగా శాసనాలు ఉన్నాయి. ఇక్కడి విశిష్టత ఏమిటంటే ప్రతి సంవత్సరం రెండు పర్యాయాలు ఉత్తరాయణం, దక్షిణాయణంలో సూర్యకిరణాలు స్వామివారి పాదాలను అభిషేకిస్తాయి. ఫిబ్రవరి 27, 28వ తేదీలలో ఉదయం 6 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల 55 నిమిషాలు వరకు.. దక్షిణాయంలో కన్యా సంక్రమణంలో చిత్తకార్తెలో ఇంకోసారి ఇలానే జరుగుతుంది.- రఘునాథచారి, ఆలయ అర్చకులు
ఇవీ చదవండి: