Accidents in Andhra Pradesh: చేనేత దంపతుల మృతితో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మగ్గం పై వచ్చే సంపాదనపై జీవిస్తూ.. చాలీచాలని డబ్బులతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. వచ్చిన సంపాదనలో చాలా వరకూ మందులకే వెళ్లిపోతున్నాయి. కానీ గత కొన్ని నెలలుగా చేనేత పని లేక.. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. కనీసం మందులు కొనడానికి కూడా కష్టంగా మారింది. ఈ క్రమంలో ఈ విషాద ఘటన చోటుచేసుకోవడంతో.. వీరి మృతి ప్రమాదమా.. లేక ఆత్మహత్యనా అని పలు అనుమానాలకు తావిస్తోంది.
బాపట్ల జిల్లా వేటపాలెం మండలం దేశాయిపేటలో రైలు ఢీకొని దంపతులు మృతి చెందారు. ఐటీఐ కాలనీకి చెందిన కడప చెన్నయ్య (72), సుబ్బలక్ష్మీ(64) దంపతులు చేనేత కార్మికులుగా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉండగా.. వారికి వివాహాలు జరిగాయి. సుబ్బలక్ష్మీ గత కొంతకాలంగా మెదడుకు సంబంధించిన వ్యాధితో ఇబ్బందులు పడుతుంది. మగ్గంపై వచ్చే సంపాదనతోనే ఆమెకు వైద్యం చేయిస్తున్నారు.
కాగా గడిచిన మూడు నెలలుగా చేనేత పని కూడా లేకపోవడంతో.. మందులకు డబ్బులు లేక దంపతులు ఇద్దరూ తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో స్థానిక విఘ్నేశ్వర కాలనీలో ఉంటున్న తమ తమ్ముడి ఇంటికి వెళ్లి వస్తామని చెప్పి.. భార్యభర్తలు ఇద్దరూ ఇంటినుంచి బయలు దేరారు.
ఈ సమయంలో కాలనీ పక్క నుంచి ఒంగోలు వైపు వెళ్లే రైలు వీరిని ఢీ కొట్టడంతో ఘటనా స్థలంలోనే ఇద్దరూ మృతి చెందారు. లోకో పైలెట్ ఇచ్చిన సమాచారంతో.. రైల్వే ఎస్సై కొండయ్య ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేసి మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా.. అనారోగ్య సమస్యలతో పాటు ఎవరికి భారం కాకూడదని ఆత్మహత్య చేసుకున్నారా? అనేది విచారణలో తెలియాల్సి ఉంది.
పెళ్లైన నాలుగు నెలలకే..: పెళ్లయి నాలుగు నెలలకే.. ఆ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. అత్తారింట్లో ఉన్న భార్యను కలిసి.. తిరిగి వస్తున్న ఆ యువకుడిని లారీ రూపంలో మృత్యువు బలితీసుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం పెదగెద్దాడ గ్రామ శివారులో రెండు ద్విచక్ర వాహనాలను లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
ఈ ఘటనలో దేవీపట్నం మండలం మంటూరుకు చెందిన కొండ్ల అచ్యుతరామిరెడ్డి (25) అనే యువకుడు ప్రమాద స్థలంలోనే మృతి చెందగా.. పెదగెద్దాడ పంచాయతీ పెదపాడు గ్రామానికి చెందిన కత్తుల రవితేజరెడ్డి, ఎర్రగొండ రాజారావు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. అచ్యుతరామిరెడ్డి మృతితో.. కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.