Illegal mining of sand in Gundlakamma reservoir: ఇసుక అక్రమ వ్యాపారానికి వ్యాపారులు రకరకాల మార్గాలు ఎంచుకుంటున్నారు. నదీ తీర ప్రాంతాల్లో విచ్చలవిడిగా ఇసుక తవ్వి సొమ్ము చేసుకుంటున్న వీరు ఇంకా చాలనట్లు జలాశయాల్లో కూడా నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమ తవ్వకాలకు సిద్ధమవుతున్నారు. అధికార పార్టీ నాయకులు అండదండలతో ఏకంగా డ్రెడ్జింగ్ యంత్రాలను జలాశయాల్లోకి దించి ఇసుక తోడేందుకు ఏర్పాటు చేసుకున్నారు. ప్రకాశం, బాపట్ల జిల్లాల పరిధిలో విస్తరించిన గుండ్లకమ్మ రిజర్వాయర్లో ఇసుక అక్రమ తవ్వకాలకు డ్రెడ్జింగ్ యంత్రాలను తీసుకొచ్చి దింపారు. అధికారులు అనుమతి లేవని పేర్కొంటున్నప్పటికీ తవ్వకాలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
నదుల్లో, వాగుల్లో ఇసుక నిల్వలు తరిగిపోవడంతో అక్రమార్కులు మరో మార్గాన్ని ఎంచుకున్నారు . ఇసుకను యంత్రాల సహాయంతో తోడి సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు. బాపట్ల జిల్లా అద్దంకి మండలం మణికేశ్వరం సమీపంలోని గుండ్లకమ్మ నది మధ్యలో డ్రెడ్జర్ సహాయంతో ఇసుకను తవ్వేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం మల్లవరం సమీపంలో డ్రేజ్జర్ సహాయంతో నదిలో ఇసుక తవ్వేందుకు ప్రయత్నించగా అధికారులు అడ్డుకున్నారు.