Chandrababu visited Amarnath family: రాష్ట్రాన్నిజగన్ మోహన్ రెడ్డి రావణ కాష్టంలా మార్చారని.. వైసీపీ చేసే అరాచకాలకు ప్రజలు భయబ్రాంతులకు లోనవుతున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. బాపట్ల జిల్లాలో హత్యకు గురైన అమర్నాథ్ కుటుంబాన్ని చంద్రబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అమర్నాథ్ హత్య తర్వాత ఆడబిడ్డలను కాపాడకునేందుకు కూడా భయపడే పరిస్థితి వచ్చిందన్నారు. ముఖ్యమంత్రికి కూడా ఆడపిల్లలు ఉన్నారని.. వాళ్లను ఏవరైనా ఏమైనా అంటే సీఎం చూస్తూ ఊరుకుంటారా.. ఇలానే స్పందిస్తారా అని ప్రశ్నించారు. టీడీపీ జోక్యం చేసుకోకపోతే బాధితులపైనే ఎదురు కేసులు పెట్టేందుకు వైసీపీ నేతలు, పోలీసులు కుట్ర పన్నారని ఆరోపించారు. అందుకే అమర్నాథ్ సోదరికి ధైర్యం చేప్పేందుకు తాను ఇక్కడకు వచ్చానని అన్నారు.
సీఎం స్పందించకపోతే నేరస్థులు ఎంతకైనా తెగిస్తారు..అక్కను వేధిస్తున్నాడని తమ్ముడు ధైర్యంగా ఎదురు తిరిగితే ఇక బలైపోవాలా అని నిలదీశారు. రావణ కాష్టంలా తయారవుతున్న రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ లేదని మండిపడ్డారు. తాము కూడా మనుషులమేనని వైసీపీ నేతలు గ్రహించాలని హితవు పలికారు. ట్యూషన్‌కి వెళ్తున్న అమర్నాథ్ని అతి కిరాతకంగా సజీవదహనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రాణాపాయంతో అమర్నాథ్ కొట్టుమిట్టాడుతుంటే పోలీసులు నింపాదిగా వ్యవహరించారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కనీసం స్పందించకపోతే నేరస్థులు ఎంతకైనా తెగిస్తారని అన్నారు. భర్త ముందే భార్యని వేధించినా నోరెత్తకూడదనే పరిస్థితి ముందు ముందు తీసుకొస్తారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రికి కూడా ఆడబిడ్డలు ఉన్నారని గుర్తించాలన్నారు. సీఎం ఇంటి సమీపంలో సామూహిక అత్యాచారం జరిగినా జగన్మోహన్ రెడ్డి స్పందించడా అని విమర్శించారు.