Attack: అన్నమయ్య జిల్లాలోని రాజంపేట మండలం తాళ్లపాక గ్రామంలో అధికార పార్టీకి చెందినవారు ఓ దారి వివాదంలో సామాన్యులపై విరుచుకుపడ్డారు. తమ పొలంలో దౌర్జన్యంగా రోడ్డు వేశారని ఓ వర్గంవారు చెప్పడంతో అధికార పార్టీకి చెందిన మరో వర్గం వారు మాకూ ఇక్కడే రోడ్డు ఉందంటూ వివాదానికి తెర తీశారు. అధికార పార్టీ వర్గీయులు మరో వర్గానికి చెందిన మహిళలపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు.
గ్రామంలోని రాజమ్మకు చెందిన భూమిలో ఆదివారం అధికార పార్టీకి చెందిన ఓ వర్గంవారు రహదారి వేయడంతో బాధితురాలు అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు స్పందించకపోవడంతో మంగళవారం ఆమె తన వర్గం వారితో కలిసి రోడ్డును తొలగించేందుకు ప్రయత్నించారు. అధికార పార్టీకి చెందిన అర్జున్‌రాజు, ఆయన సోదరుడి కుమారుడు రాజశేఖర్‌రాజు, మరికొందరు కలిసి జయమ్మ, సుబ్బమ్మ, రాజమ్మలపై కర్రలు, రాళ్లతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు.
ఇదే సంఘటనలో అధికార పార్టీకి చెందిన మెడిద రాజు, జయమ్మ, సురేష్, మణికంఠ, నరసింహ, శివరాజు, నాగరాజుకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న మన్నూరు, పెనగలూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.