nara lokesh yuvagalam padayatra : ప్రజా సమస్యలు తెలుసుకోవడం, ప్రజలకు భరోసా కల్పించడమే లక్ష్యంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 42వ రోజుకు చేరింది. స్వల్ప విరామానంతరం మంగళవారం తిరిగి ప్రారంభమైంది. పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిబంధనల కారణంగా రెండు రోజుల పాటు పాదయాత్రకు విరామం ప్రకటించడం విదితమే. తిరిగి ఇవాళ ఉదయం అన్నమయ్య జిల్లా కురబలకొట మండలం కంటేవారిపల్లి విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలో పాదయాత్ర సాగనుంది. పాదయాత్ర ప్రారంభానికి ముందు సెల్ఫీ విత్ నారా లోకేష్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కంటేవారిపల్లి నుంచి పాదయాత్ర కొనసాగుతోంది.
జనవరి 27న ప్రారంభమై... యువగళం పాదయాత్ర.. జనవరి 27వ తేదీన చిత్తూరు జిల్లాలో ప్రారంభమైంది. తొలి రోజు నుంచి పోలీసులు లోకేశ్‌ను అడుగడుగునా నిలువరించారు. పలు రకాల ఆంక్షలను అమలు చేశారు. అయినా.. ప్రజల మద్దతు, పార్టీ కార్యకర్తల అండదండలతో లోకేశ్ పాదయాత్రను కొనసాగిస్తున్నారు. కాగా, విరామానికి ముందు.. 41వ రోజు తంబళ్లపల్లె నియోజకవర్గంలో బ్రేక్ పడింది. ఎన్నికల నియమావళి, పోలింగ్ నిబంధనలు దృష్టిలో ఉంచుకొని ఎన్నికల సంఘాన్ని గౌరవించి పాదయాత్రకు తాత్కాలికంగా విరామం ప్రకటించారు.
అడుగడుగునా జన నీరాజనం..లోకేశ్ పాదయాత్రకు అడుగడుగునా జనం నీరాజనం పలుకుతున్నారు. మహిళలు, యువతులు పెద్ద ఎత్తున ఎదురువెళ్లి హారతి పడుతున్నారు. పాదయాత్రలో భాగంగా సెల్ఫీ విత్ లోకేశ్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. లోకేశ్ తో సెల్ఫీ తీసుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు.