Nara Lokesh Yuvagalam 37th Day Padayatra Updates: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన 'యువగళం' పాదయాత్ర అనేక ఆంక్షలు, అడుగడుగునా అడ్డంకులు, తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటూ నేటితో 37 రోజులకు చేరుకుంది. 'యువగళం' పాదయాత్ర మొదలైన (జనవరి 27వ తేదీన) రోజు నుంచి ఈరోజు వరకూ ఆయా గ్రామాల్లో ఉన్న పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ ఎత్తున్న పాదయాత్రలో పాల్గొంటూ.. లోకేశ్‌కు మద్దతును ప్రకటిస్తున్నారు. పాదయాత్రలో భాగంగా నారా లోకేశ్ అన్ని వర్గాల వారితో ముఖాముఖి కార్యక్రమాలను నిర్వహించి, వారి సమస్యలను ఓపికగా వింటున్నారు. అనంతరం 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలవారి కోసం ఏయే పథకాలను ప్రవేశపెట్టనున్నారో.. ఏయే చర్యలు తీసుకోనున్నారో.. రాష్ట్రంలోని నిరుద్యోగ యువత భవిష్యత్తు కోసం అవలంబించబోయే విషయాలను ప్రస్తావిస్తూ, మహిళలకు, వృద్దులకు, రైతులకు భరోసానిస్తున్నారు.
ఈ క్రమంలో 37వ రోజు 'యువగళం' పాదయాత్ర పీలేరు నియోజకవర్గంలోని కలికిరి ఇందిరమ్మ కాలనీ నుంచి ప్రారంభమైంది. పాదయాత్ర ప్రారంభానికి ముందు లోకేశ్ ఇందిరమ్మ కాలనీలోని విడిది కేంద్రం వద్ద ముస్లిం ప్రతినిధులతో ఆయన ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు ముస్లిం సోదరులు 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లిం సోదరులకు ఏయే కార్యక్రమాలు చేపట్టనున్నారో తెలపాలని పలు ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్నలకు యువనేత నారా లోకేశ్ సమాధానాలు చెప్పారు.
కార్యక్రమంలో లోకేశ్ మాట్లడూతూ.. ''దేశంలోనే మొదటిసారిగా మైనారిటీ కుటుంబాాల్లో పేదరికం ఉందని గుర్తించి, వారికోసం మైనారిటీ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది.. స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు. ఎందుకోసం మైనారిటీ కార్పొరేషన్‌ను పెట్టారంటే.. ఆ రోజుల్లోనే పేద మైనారిటీలకు లోన్లు ఇచ్చి.. వారిని ఆ పేదరికం నుంచి బయటికి లాగడానికే మైనారిటీ కార్పొరేషన్‌ను ఆనాడే తారకరామారావు గారు పెట్టారు. కానీ, ఈ వైసీపీ అధికారంలోకి వచ్చాక మైనార్టీ కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేశారు. టీడీపీ హయాంలో ముస్లింలకు అమలు చేసిన పథకాలను ఈ వైసీపీ ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది. జగన్ పాలనలో మైనార్టీలపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వక్ఫ్‌బోర్డుని బలోపేతం చేసి.. ముస్లింల ఆస్తులను కాపాడతాం. బీజేపీతో పొత్తు ఉన్నప్పటికీ టీడీపీ ప్రభుత్వంలో మైనార్టీలపై ఎలాంటి దాడులు జరగలేదు'' అని ఆయన ఆగ్రహించారు.