కల్తీ కల్లు అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఓ దుకాణంపై అనంతపురంలో ఆషాభి అనే వైకాపా మహిళా సర్పంచ్ ఆందోళన వ్యక్తం చేశారు. అనంతపురం రూరల్ రాజీవ్ కాలనీలో కల్లు దుకాణం నిర్వహిస్తున్న వ్యక్తిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అనుమతులు లేకున్నా.. నకిలీ లైసెన్సుతో కల్తీకల్లు విక్రయిస్తున్నారని కాలనీ మహిళలు మండిపడ్డారు. కల్లు నిల్వ చేసిన సీసాలను ధ్వంసం చేశారు.
ప్రభుత్వం అనుమతులు ఇచ్చి ఉంటే దూర ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవాలని.. కాలనీలో ప్రజలకు ఇబ్బందికరంగా దుకాణాన్ని నడపడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. యువత నుంచి పెద్దల వరకు కల్తీకల్లు తాగి అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీల మధ్య కల్లు దుకాణం ఉండటంతో.. చిన్న వయసులోనే మద్యానికి అలవాటు పడుతున్నారని అన్నారు. తమ గ్రామంలో ఇలాంటి సంఘటనలకు తావులేకుండా చూస్తామని ప్రజలకు సర్పంచ్ ఆషాభి పేర్కొన్నారు.