కరోనా వేళ ఆన్‌లైన్ విద్య మారుమూల గ్రామాలకు సైతం చేరువ అయింది. తరగతుల సంగతి ఎలా ఉన్నప్పటికీ... పరీక్షల నిర్వహణ మాత్రం ఇబ్బందిగా మారింది. ప్రైవేట్ విద్యా సంస్థలు ఫీజు చెల్లించిన వారికే లింకులు పంపుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు సైతం పరీక్షలు నిర్వహించడానికి ఇబ్బంది పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులకు ఆన్‌లైన్ ప్రశ్నపత్రాలు రూపొందించి ఉచితంగా అందుబాటులో ఉంచుతున్నారు అనంతపురం జిల్లా ఉరవకొండకు చెందిన యువకుడు నూర్.
ప్రశ్నపత్రాలతో విజ్ఞానం
టెలిగ్రాంలో 'ఎలిఫెంట్ ఆన్‌లైన్ ఎగ్జామ్స్' అని టైప్ చేస్తే ప్రశ్నపత్రాలు కనిపించేలా నూర్ రూపొందించారు. ఒకటి నుంచి ఐదు వరకు విద్యార్థుల కోసం 278 ఆన్‌లైన్ ప్రశ్నపత్రాలు రూపొందించారు. వీటి ద్వారా ఉరవకొండ పట్టణంతోపాటు, కర్ణాటక తదితర ప్రాంతాల్లో 18 వేలకు పైగా విద్యార్థులు పరీక్షలు రాశారు. ఆన్‌లైన్ పరీక్ష రాసిన వెంటనే తప్పు, ఒప్పులు కూడా తెలిసేలా దీన్ని రూపకల్పన చేశారు. ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులకు ఉపయోగపడేలా తాను పలు అంశాలపై ఆన్‌లైన్ ప్రశ్నపత్రాలు రూపొందించినట్లు నూర్ చెబుతున్నారు.
చిత్రాలతో బోధన
ప్రశ్నపత్రాలతో పాటు 'నూర్ పిక్చర్ డిక్షనరీ' రూపొందించారు ఈ యవకుడు. ఇందులో రెండు గంటలపాటు వీక్షించేలా జంతువులు, పక్షులు, ఆహార పదార్థాలు, శరీర భాగాలు, వివిధ వృత్తులపై చిత్రాలు అందుబాటులో ఉంచారు. విద్యార్థుల తలిదండ్రులు తక్కువ శ్రమతో పిల్లలకు అనేక అంశాలపై విషయ పరిజ్ఞానం నేర్పేలా ఈ చిత్రాలు తయారు చేశారు. ఎలాంటి ప్రయోజనం ఆశించకుండా విద్యార్థులకు ఆన్‌లైన్ పరీక్షలు, చిత్రాలతో విజ్ఞానం అందిస్తున్నాడని, వీటిని బోధనకు ఉపయోగిస్తున్న ఉపాధ్యాయులు చెప్పారు.
సాయం కోసం ఎదురుచూపు
తాను రూపొందించిన ప్రశ్నపత్రాలతో ఆన్‌లైన్ పరీక్షలు రాయటానికి కంప్యూటర్, స్మార్ట్ ఫోన్లు అందుబాటులో లేని స్థానిక పేద విద్యార్థుల కోసం నూర్ రెండు కంప్యూటర్లు కూడా ఏర్పాటు చేశారు. వీటితో పాటు ఫుట్ బాల్ కోచ్గా విద్యార్థులకు ఆట ఉచితంగా నేర్పుతున్నారు. షెడ్యూల్ రూపొందించుకొని పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు ఫుట్ బాల్ నేర్పుతున్నారు. ప్రస్తుతం ఓ ప్రైవేట్ పాఠశాలలో తొమ్మిది వేల రూపాయల వేతనంతో పనిచేస్తున్న ఇతను.. ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తే విద్యార్థుల కోసం అనేకం రూపొందిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి:తండ్రీకుమార్తెల ఆలోచనలు.. సరికొత్త ఆవిష్కరణలు