అనంతపురం జిల్లాలో ఊహకందని విధంగా వైకాపా గెలుపు సాధ్యమైంది.హేమాహేమీలు, తప్పకుండా విజయం సాధిస్తారనుకున్న తెదేపా అభ్యర్థులు ఓటమి చవిచూడాల్సి వచ్చింది.
అనంతపురంలో తెదేపా తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, వైకాపా తరఫున మాజీ ఎంపీ అనంతవెంకట్రామిరెడ్డి అనంత వెంకట్రామిరెడ్డి పోటీ పడ్డారు. నగర ఓటర్లు మరోసారి తనకు అవకాశం ఇస్తారని నమ్మకం పెట్టుకున్న ప్రభాకర్ చౌదరికి ఎదురుదెబ్బ తగిలింది. అనంతవెంకట్రామిరెడ్డి అనూహ్యంగా విజయం సాధించారు. తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టాలనే ఆయన కోరిక నెరవేరనుంది.
జేసీ కుటుంబానికి షాక్
జేసీ కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉండి, వాళ్లకే ప్రతిసారి పట్టంకట్టే తాడిపత్రి నియోజకవర్గంలో తొలిసారి ఎదురుదెబ్బ తగిలింది. ఇక్కడ తెదేపా తరఫున జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి పోటీ చేయగా .. వైకాపా తరఫున పెద్దారెడ్డి బరిలో దిగారు. అస్మిత్కే మెజార్టీ వస్తుందని జేసీ కుటుంబీకులు భావించారు. 1985 నుంచి ఓటమి ఎరుగని ఆ కుటుంబానికి తొలిసారిగా వైకాపా అభ్యర్థి చెక్ పెట్టారు.
పద్మావతికే పట్టం
శింగనమలలో తెదేపా తరఫున బండారు శ్రావణిశ్రీ, వైకాపా తరఫున జొన్నలగడ్డ పద్మావతి పోటీ చేశారు. అయిదేళ్లుగా నియోజకవర్గంలో పద్మావతి కొంత పట్టు సాధించారు. కానీ చివర్లో వచ్చిన శ్రావణి గట్టిపోటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆమెకు జేసీ సోదరులు కూడా మద్దతునిచ్చారు. అయినప్పటికీ శ్రావణిశ్రీకి పరాభవం తప్పలేదు
కాలవకు కష్టకాలం
రాయదుర్గానికి సంబంధించి ఓట్ల లెక్కింపుతో తొలుత ఆధిక్యం తెదేపా, వైకాపా వైపు దోబూచులాడగా, రెండు రౌండ్లు పూర్తయ్యే సరికి వైకాపా ఏకపక్షంగా ఆధిక్యం పొందింది. ఇక్కడ తెదేపా తరఫున మంత్రి కాలవ శ్రీనివాసులపై వైకాపా తరఫున మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి బరిలో దిగి గెలిచారు.
త్రిముఖ పోరు
కళ్యాణదుర్గంలో తెదేపా తరఫున చివరి నిమిషంలో టిక్కెట్ దక్కించుకున్న ఉమామహేశ్వరరావు నాయుడు, వైకాపా తరఫున ఉషశ్రీ చరణ్ బరిలో నిలిచారు. పీసీసీ అధ్యక్షుడు రఘవీరా రెడ్డి కాంగ్రెస్ తరఫున పోటీలో ఉన్నందున త్రిముఖ పోరు ఉంటుందని అందరూ భావించారు. కానీ విజయం వైకాపానే వరించింది.
యువనేతకు పరాభవం
రాష్ట్ర ప్రజల దృష్టి కేంద్రీకృతమైన రాప్తాడులో ఈసారి విభిన్న ఫలితం వచ్చింది. ఇక్కడే తెదేపా తరఫున మంత్రి పరిటాల సునీత కుమారుడు శ్రీరామ్ బరిలో నిలిచారు. ఈయనపై వైకాపా తరఫున తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి పోటీ చేశారు. జిల్లాలో అత్యంత హోరాహోరీ పోరు ఇక్కడే సాగింది. చివరకు శ్రీరామ్ ఓటమి పాలయ్యాడు. వైకాపా విజయం సాధించింది.
పల్లె ఆశలు ఆవిరి
పుట్టపర్తిలో పల్లె రఘనాథరెడ్డికి పరాభవం తప్పలేదు. ఇక్కడ తెదేపా తరఫున ఆయన బరిలో నిలవగా.. వైకాపా తరఫున దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి పోటీ చేశారు. హ్యాట్రిక్ విజయం సాధించాలన్న పల్లెకు చుక్కెదురైంది. గెలుపును వైకాపా ఎగరేసుకుపోయింది.
వైకాపా విజయపరంపర
ధర్మవరంలోనూ తెదేపా అభ్యర్థి గోనుగుంట్ల సూర్య నారాయణ గెలుస్తారని అంతా భావించినా.. వైకాపా అభ్యర్థి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి విజయం సాధించారు. పెనుకొండలో సైతం తెదేపా జిల్లా అధ్యక్షుడు,సిట్టింగ్ ఎమ్మెల్యే పార్థసారిథికి ఓటమి తప్పలేదు. ఇక్కడ వైకాపా అభ్యర్థి శంకరనారాయణ విజయకేతనం ఎగురవేశారు. మడకశిరలో మళ్లీ రెండోసారి వైకాపా బాధ్యతలు చేపట్టనున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పేస్వామి... తెదేపా అభ్యర్థి ఈరన్నపై విజయం సాధించారు. కదిరిలో మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్పై వైకాపా అభ్యర్థి డాక్టర్ సిద్ధారెడ్డి ఆధిక్యం సాధించారు. మైనార్టీ ఓట్లు వైకాపాకు కలిసొచ్చాయి. గుంతకల్లులో వైకాపా అభ్యర్థి వెంకట్రామిరెడ్డి విజయం సాధించారు. ఇక్కడ తెదేపా తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ పోటీ చేసి పరాభవం పొందారు.
'లెజెండ్'రీ విజయం
జిల్లాలో తెదేపా తిరుగులేని విజయం సాధించి, ప్రతి రౌండ్లో ఆధిక్యంతో దూసుకెళ్లిన ఏకైక నియోజకవర్గం హిందూపురం. ఈ అసెంబ్లీ స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రెండోసారి పోటీ చేశారు. వైకాపా తరఫున మాజీ ఐపీఎస్ అధికారి ఇక్బాల్ పోటీ చేసి ఓడిపోయారు. తెదేపాను ఆది నుంచి ఆదరిస్తున్న హిందూపురంలో మరోసారి ఓటర్లు పట్టం కట్టారు.
చివరి వరకు
ఇక ఉరవకొండ ఫలితం చివరి వరకు ఉత్కంఠ రేపింది. జిల్లాలోని నియోజకవర్గాల ఫలితాలు ఒక ఎత్తు అయితే ఉరవకొండ మరో ఎత్తు . చివరి దాకా ఆధిక్యం దోబూచలాడి పయ్యావుల కేశవ్ వైపు మొగ్గు చూపింది. వైకాపా అభ్యర్థి విశ్వేశ్వర రెడ్డిపై విజయం సాధించారు.