మా గొంతెండుతోంది...దాహం తీర్చండి అనంతపురం జిల్లా కుందుర్పి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. కుళాయిల్లో బొట్లుబొట్లుగా వస్తోన్న నీటిని ఒడిసిపట్టి... పోటీ పడి మరీ దాహార్తిని తీర్చుకుంటున్నారంటే.. పరిస్థితి ఏంటో ఇట్టే అర్థమవుతోంది. సరిపడా నీరు లేక... పాఠశాలకు దూరంగా ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో వచ్చే నీటిపైనే ఆధార పడుతున్నామని విద్యార్థులు వాపోతున్నారు. తాగేందుకే నీరు లేదంటే.. ఇక మరుగుదొడ్లకు నీటి సరఫరా సంగతి సరేసరి. అధికారులు వెంటనే స్పందించి నీటి కష్టాలపై దృష్టి సారించాలని బడిపిల్లలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇతర పథకాలపై దృష్టి సారించే పాలకులు... ముందు ప్రభుత్వ పాఠశాలల్లోని తాగునీటిపై దృష్టి పెట్టాలని విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు.