ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తుంగభద్ర చౌర్యానికి చెక్... ఇకపై ఆ నీరు ఆంధ్రాకే! - tungabhadra water utilized by andhrapradesh state till now

తుంగభద్ర జలాశయం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే నీటి కోటాపై ఆశలు చిగురిస్తున్నాయి. గతేడాది నుంచి టెలీమీటర్ల సాంకేతిక పరిజ్ఞానంతో కాలవలో ప్రవాహాన్ని కొలవడం ప్రారంభించారు. దీంతో కర్ణాటక రాష్ట్రంలో జరుగుతున్న జల చౌర్యం బట్టబయలైంది. టీబీ డ్యాం నుంచి హెచ్చెల్సీ, ఎల్లెల్సీ కాలవల ద్వారా రాష్ట్రానికి వస్తున్న నీటిని... కన్నడ రైతులు చౌర్యం చేస్తున్న ప్రదేశాలను అధికారులు గుర్తించారు. ఫలితంగా ఇకపై ఆ నీరు ఆంధ్రా రైతులకే చేరనుంది.

తుంగభద్ర చౌర్యానికి చెక్... ఇకపై ఆ నీరు ఆంధ్రాకే!

By

Published : Aug 7, 2019, 8:03 AM IST

Updated : Aug 7, 2019, 11:56 AM IST

తుంగభద్ర చౌర్యానికి చెక్... ఇకపై ఆ నీరు ఆంధ్రాకే!
అనంతపురం జిల్లాకు వస్తున్న తుంగభద్ర ఎగువ కాలవ, కర్నూలు జిల్లాకు వెళ్లే దిగువ కాలవల నుంచి రాష్ట్ర రైతులకు ఎప్పుడూ కోటా మేరకు నీరు అందలేదు. ఈసారి టీబీ బోర్డు అధికారులు జలచౌర్యంపై కఠినంగా వ్యవహరించేలా ప్రణాళిక చేశారు. ఈ రెండు కాలవలకు నీటిని విడుదల చేశాక కట్టుదిట్టమైన పహారాతో జలచౌర్యానికి చెక్ పెట్టనున్నారు.

హెచ్చెల్సీ ద్వారానే తాగునీరు...

అనంతపురం జిల్లా తాగునీటి అవసరాలు 80 శాతంపైగా హెచ్చెల్సీ ద్వారానే తీరుతున్నాయి. కర్నూలు జిల్లాకు ఎల్లెల్సీ కాలవ ద్వారా నీరు వెళుతోంది. కర్నూలు జిల్లాలో తీవ్ర దుర్భిక్ష ప్రాంతంగా ఉన్న పడమర వైపున పలు గ్రామాలకు తాగు, సాగు నీరందుతోంది. ఈ రెండు కాలవల కింద ఆయా జిల్లాల అవసరాల కోసం గతంలో ట్రైబ్యునల్ నిర్ణయించిన కోటా మేరకు తుంగభద్ర డ్యాం బోర్డు నీటిని విడుదల చేస్తుంది. అయితే ఈ కాలవలు నిర్మించినప్పటి నుంచి కర్ణాటక రైతులు జలచౌర్యం చేస్తుండటంతోఎల్లెల్సీ, హెచ్చెల్సీల ద్వారా ఆంధ్రప్రదేశ్​కు ఎప్పుడూ కోటా మేరకు నీరు అందడంలేదు. ఈ జలచౌర్యాన్ని అడ్డుకొని, కఠినంగా వ్యవహరించే ప్రణాళికతో డ్యాం బోర్డు అధికారులు చర్యలు ప్రారంభించారు.

కర్ణాటక నుంచి అనంతలోకి...

తుంగభద్ర జలాశయం నుంచి మొదలయ్యే హెచ్చెల్సీ కాలవ నీరు కర్ణాటక రాష్ట్ర భూబాగంలో 105 కిలోమీటర్లు ప్రవహించి అనంతపురం జిల్లాలోకి ప్రవేశిస్తుంది. డ్యాం నుంచి ఎల్లెల్సీ కాలవ నీరు కర్ణాటక భూబాగంలో 250 కిలోమీటర్లు ప్రవహించి కర్నూలు జిల్లాలోకి వస్తుంది. అక్కడ పర్యవేక్షణ లోపించడం, కర్ణాటక రైతులకు అక్కడి అధికారులు, పోలీసులు మద్దతుగా నిలవడంతో విచ్చల విడిగా జలచౌర్యం జరుగుతున్నట్టు తెలుస్తోంది. హెచ్చెల్సీ కాలవపై జలచౌర్యం తక్కువే అయినప్పటికీ, ఎల్లెల్సీ కాలవపై రెండువేల ప్రదేశాల్లో భూగర్భంలో నుంచి ప్రవాహం కిందకు పైపులు అమర్చి నీటిని పెద్దఎత్తున లాగేస్తున్నారు. బళ్ళారి జిల్లాలో ఎల్లెల్సీలో చౌర్యం చేసిన నీటితో వేల ఎకరాలు సాగుచేస్తున్నారు.

రాష్ట్రానికి కేటాయింపులు ఇలా...

రాష్ట్రానికి కేటాయించిన కోటా మేరకు హెచ్చెల్సీ కాలవకు ప్రస్తుతం 25 టీఎంసీలు, ఎల్లెల్సీ కాలవకు 18.6 టీఎంసీలు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అంత నీరు ఎప్పుడూ రాలేదు. దీనిపై కఠినంగా వ్యవహరించాల్సిన నిర్ణయం తీసుకున్న టీబీ బోర్డు ఈసారి ఎల్లెల్సీ కాలవ నుంచి పైపులు వేసిన చోట కాంక్రిట్​తో అన్ని పైపులను మూసే చర్యలు ముమ్మరం చేశారు. ఈ కాలవకు నీటిని విడుదల చేసే లోపు కర్ణాటక భూబాగంలో కాలవ కింద అమర్చిన పైపులను అధికారులు ధ్వంసం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

గతేడాదే శ్రీకారం..

గత సంవత్సరం నుంచే ధ్వంసం చేసే పనికి శ్రీకారం చుట్టినప్పటికీ... కర్ణాటకలోని ప్రజాప్రతినిధులు, రైతులు డ్యాం అధికారులపై దాడులకు యత్నించడంతో వెనక్కు తగ్గారు. అయితే ఈసారి పోలీసుల రక్షణతో జలచౌర్యానికి అడ్డుకట్టవేసే చర్యలు మొదలయ్యాయి. టెలీ మీటర్లు రెండు కాలవల మీద అమర్చడంతో కర్ణాటక భూబాగంలో జలచౌర్యం జరుగుతున్న విషయం బట్టబయలైంది. గత ఏడాది జలచౌర్యం పసిగట్టి, లెక్కకట్టిన బోర్డు అధికారులు ఆ వాటాను కర్ణాటక కోటాలో కోతకోసే ప్రణాళిక చేశారు.

తుంగభద్ర డ్యాం బోర్డు అధికారులు ఓవైపు నీటిని కొలిచే ఆధునిక పరిజ్ఞానం వినియోగిస్తూనే, మరోవైపు జలచౌర్యంపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఫలితంగా ఈసారి రాయలసీమలోని మూడు జిల్లాల్లో తాగు, సాగు నీటి సమస్యలకు పరిష్కారం లభించనుంది.

ఇదీ చదవండీ... ఉత్తర బంగాళాఖాతంలో వాయుగుండం.. 24 గంటల్లో వర్షాలు

Last Updated : Aug 7, 2019, 11:56 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details