అనంతపురం జిల్లా గుంతకల్లులోని తిలక్ నగర్లో దారుణం చోటు చేసుకుంది. కన్నతల్లినే ఓ కుమారుడు అతి కిరాతకంగా వేట కొడవలితో నరికి చంపాడు. మృతురాలు సంజమ్మకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. సంజమ్మ భర్త నరసింహులు రైల్వేలో ఉద్యోగం చేస్తూ అనారోగ్యంతో మృతి చెందాడు. కారుణ్య నియామకం కింద పెద్ద కుమారుడు వీరుపాక్షికి రైల్వేలో ఉద్యోగం వచ్చింది. చిన్న కుమారుడు శ్రీనివాసులు కొంతకాలం కర్ణాటక ప్రాంతంలోని జిందాల్ స్టీల్ ఫ్యాక్టరీలో పని చేశాడు. ప్రస్తుతం ఉద్యోగం మానేసి 10 నెలల నుంచి ఇంటివద్దనే ఉంటున్నాడు. తల్లి తమ సొంత గ్రామమైన గుమ్మనూరు నుంచి గుంతకల్లుకు వచ్చింది. అనంతరం తల్లి, కుమారుడు మధ్య వివాదం నెలకొంది. మానసిక స్థితి సరిగాలేని శ్రీనివాసులు తల్లిని వేట కొడవలితో అతి కిరాతకంగా 18 సార్లు నరికాడు. రక్తపు మడుగులో పడి సంజమ్మ (65) అక్కడికక్కడే మృతి చెందింది. శ్రీనివాసులు భార్య తన భర్తకు మానసిక స్థితి సరిగా లేదని... ఉద్యోగం రాకపోవటం వల్ల తరచు బాధపడే వాడని తెలిపింది. తల్లిని ప్రేమతో చూసుకునేవాడని కేవలం క్షణికావేశంలో ఇలా చేసి ఉంటాడని ఆవేదన చెందింది. సమాచారం అందుకున్న గుంతకల్లు 2వ పట్టణ పోలీసులు విచారణ చేపట్టారు. హత్యకు గల కారణాలు విచారణలో తేలుతాయని.... విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామని పోలీసు అధికారులు తెలిపారు.
'గుంతకల్లులో విషాదం.. కన్నతల్లినే కడతేర్చిన కొడుకు'
కని పెంచిన కన్న తల్లినే అతి కిరాతకంగా వేట కొడవలితో నరికి చంపాడో కుమారుడు. అనుబంధాన్నే మరిచి, కడతేర్చి వెళ్లిపోయాడు. కుటుంబ కలహాల కారణంగా ఇలాంటి దారుణానికి ఒడిగట్టాడని స్థానికులు భావిస్తున్నారు. ఈ ఘటన గుంతకల్లు తిలక్‌నగర్‌లో చోటు చేసుకుంది.
గుంతకల్లులో విషాదం.. కన్నతల్లినే కడతేర్చిన కొడుకు