TDP LEADER KALVA SRINIVASULU HOUSE ARREST : అనంతపురం జిల్లా రాయదుర్గంలో మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులును పోలీసులు గృహ నిర్బంధం చేసి.. అరెస్టు చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ఇసుక అక్రమాలకు పాల్పడుతున్నారంటూ... బొమ్మనహాళ్ మండలంలో కాలవ పాదయాత్ర తలపెట్టారు. యాత్రలో కాలవ శ్రీనివాసులు పాల్గొనకుండా పోలీసులు గృహనిర్బంధం చేశారు. డీఎస్పీ, ఐదుగురు సీఐలు, ఐదుగురు ఎస్సైలతో పాటు సుమారు 150 మంది పోలీసులు నివాసం చుట్టూ పహారా కాశారు. పాదయాత్రకు అనుమతి లేదంటూ ఇంటి వద్దనే నోటీసులు ఇచ్చారు. టీడీపీకి చెందిన మండల స్థాయి ముఖ్య నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
"ఐదు కిలోమీటర్ల దూరం నేను పాదయాత్ర చేయాలనుకుంటున్నట్లు మూడు రోజుల ముందుగానే పోలీసులకు సమాచారం ఇచ్చాం. ట్రాఫిక్ లేని మారుమూల రహదారిని ఎంచుకుని మా కార్యక్రమాన్ని నిర్వహించాలనుకున్నాం. కానీ నిన్న సాయంత్రం నుంచి వందల మంది పోలీసులు రాయదుర్గం నియోజకవర్గంలో మోహరించి ప్రజలను బెదిరిస్తూ.. పౌరుల కదలికలపై నిఘా నిర్వహిస్తున్నారు. ఇదేనా మీ పోలీసుల డ్యూటీ?"-కాలవ శ్రీనివాసులు, టీడీపీ మాజీ మంత్రి