ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వరుణుడు దూరమై... వేరుశెనగ విత్తనాలు కరవై

వరుస కరవులతో అల్లాడుతున్న అనంతపురం జిల్లా రైతులకు ఈసారి ఆదిలోనే ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. ఓ వైపు రుతుపవనాలు ముఖం చాటేయడం.. మరోవైపు ప్రభుత్వం అందించే సబ్సిడీ విత్తన పంపిణీ అస్తవ్యస్తం కావడం రైతులను ఇక్కట్ల పాలుచేస్తున్నాయి.

వరుణుడు దూరమై... వేరుశెనగ విత్తనాలు కరవై

By

Published : Jun 20, 2019, 8:12 AM IST

వరుణుడు దూరమై... వేరుశెనగ విత్తనాలు కరవై
కొన్నేళ్లుగా తీవ్ర వర్షాభావంతో రైతులు పంటలు కోల్పోతున్నా.. ఖరీఫ్ వచ్చిందంటే చాలు అనంతపురం జిల్లా రైతులు వేరుశెనగసాగుకు సన్నద్ధమవుతారు. ఈ ఏడాది వర్షాలు కూడా ఆశాజనకంగా ఉంటాయన్న అంచనాలతో జూన్మొదట్లో పడ్డ వర్షాలకు రైతులు దుక్కి దున్ని పొలాలను సిద్ధం చేసుకున్నారు. కానీ రుతుపవనాలు ముఖం చాటేసి రైతులకు నిరాశ మిగిల్చాయి. ఇక ప్రభుత్వం అందించే సబ్సిడీ వేరుశెనగ విత్తన పంపిణీ కూడా ఈ ఏడాది ఆలస్యంగా ప్రారంభమైంది. 2 నెలల ముందు నుంచే విత్తన సేకరణ ప్రారంభించనప్పటికీ పంపిణీ రోజుకు కనీసం సగం కూడా జిల్లాకు చేరలేదు. ఈ ఖరీఫ్​లో 3 లక్షల క్వింటాళ్ల విత్తన పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా... ఇప్పటి వరకు కేవలం లక్షా 50వేల క్వింటాళ్లు మాత్రమే మండలాలకు చేరింది. మొదటి రెండు రోజులు పంపిణీ సజావుగానే సాగినా.. ఆ తరువాత నుంచి సమస్యలు మొదలయ్యాయి.

జిల్లాలో చాలా చోట్ల విత్తన నిల్వలు నిండుకున్నాయి. ఉదయం 6 గంటల నుంచి క్యూలైన్లలో నిల్చుంటున్న రైతులకు మధ్యాహ్నం సమయంలో విత్తనం అయిపోయిందని చేతులెతేస్తున్నారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్మవరం వంటి ప్రాంతాల్లో రైతులు ఆందోళనకు దిగుతున్నారు. ఇప్పటి వరకు 75వేల క్వింటాళ్ల విత్తనం పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. ఇక సర్వర్ల మోరాయింపుతో ఇటు రైతులు, అటు వ్యవసాయశాఖ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గంటల తరబడి క్యూలైన్లలో నిల్చున్న తరువాత సర్వర్లు పని చేయలేదని అధికారులు చెప్పడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు ఎండ వేడిమి తీవ్రంగా ఉండటం, మరోవైపు పంపిణీ కేంద్రాల షామియానాలు, తాగునీటి సౌకర్యం కరవై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కొన్నేళ్లుగా వేరుసెనగ పంట పండక విత్తనం బయటి మార్కెట్లో కూడా లభించడం లేదు. ఒక వేళ అక్కడక్కడా దొరికినా కిలో 63రూపాయలు ఉన్నందున రైతులు సబ్సిడీ విత్తనంపైనే ఆశలు పెట్టుకున్నారు. కానీ విత్తనం సకాలంలో మండలాలకు చేరుకోకపోవడం, సర్వర్లు మోరాయించడం వంటి సమస్యలు అన్నదాతలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.

ఇదీ చదవండి : 'అమరావతి' ఆగదు.. అవినీతిపై విచారణ ఆగదు!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details