Residents of Shilpa Lepakshi Nagar Colony: గేటెడ్ కమ్యూనిటీ, పిల్లల ఆట స్థలం.. విశాలమైన రోడ్లు అని అందరినీ నమ్మించారు. ఇదంతా నిజమని నమ్మి.. లక్షల రూపాయలు ఖర్చు చేసి స్థలాలు కొనుగోలు చేశారు. నగరానికి దూరంగా ప్రశాంతమైన వాతావరణం, ప్రకృతిని ఆస్వాదించే అవకాశం ఉంటుందనుకున్నారు. తీరా ఇళ్లు నిర్మించాక కాలనీ వాసులకు కన్నీరే మిగిలింది. లేఔట్‌లోని వంకను పూడ్చేసి.. శ్రీశైలం వైకాపా ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి కుటుంబం చేసిన మోసంతో తామంతా మునిగిపోయామని వారు వాపోతున్నారు. 45 రోజులుగా నీటిలోనే జీవనం సాగిస్తున్న అనంతపురం నగర శివారులోని శిల్పా లేపాక్షి నగర్ కాలనీ వాసులు..
సాధారణంగా డీటీసీపీ అనుమతి ఉన్న లేఔట్ అంటే ఎవ్వరైనా ఆ స్థలాలు, భవనాలు కొనుగోలు చేయటానికి ముందుకు వస్తారు. ప్రభుత్వంలోని వివిధ శాఖల అధికారులు నిర్దేశిత స్థలాన్ని అన్ని కోణాల్లో పరిశీలించి, నివాస యోగ్యమైనదిగా గుర్తించాకే డీటీసీపీ అనుమతి ఇస్తుంది. అయితే కర్నూలు జిల్లా శ్రీశైలం వైకాపా ఎమ్మెల్యే శిల్ప చక్రపాణిరెడ్డి కుటుంబం, తాము కొనుగోలు చేసిన భూమిలో ఉన్నవంకను పూడ్చి ఇళ్ల స్థలాలు విక్రయించి ప్రజలను ముంచేశారు. అనంతపురం నగర శివారులోని పంగల్ రోడ్డు సమీపంలో అత్యంత ఖరీదైన కాలనీగా పేరున్న శిల్ప లేపాక్షి నగర్ అంటే ప్రజలంతా భయపడే పరిస్థితి నెలకొంది.
'లేఔట్ లోని భూమిలో వంకను పూడ్చేసి ఇంటి స్థలాలు విక్రయించారని గుర్తించారు. చినుకు రాలిందంటే చాలు ఆ కాలనీ చెరువుగా మారిపోతోంది. మీమంతా మోసపోయాం. తమను ముంపు ముప్పు నుంచి రక్షించాలని అధికారుల చుట్టూ తిరిగుతున్నాం.' - శిల్ప లేపాక్షి నగర్ కాలనీ వాసులు