కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన సాగు చట్టాలను రద్దు చేయాలంటూ దిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావంగా... విజయవాడలో భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. నెల రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నప్పటికీ... ప్రధాని మోదీ వారి సమస్యలను పరిష్కరించడం లేదని డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి సూర్యారావు ఆగ్రహించారు. కార్పొరేట్లకు లాభం చేకూర్చేందుకే భాజపా ప్రభుత్వం ఈ చట్టాలు తీసుకువచ్చిందని ఆరోపించారు. ఈ నెల 27,28 తేదీల్లో రైతులు చేపట్టే నిరసనలకు డీవైఎఫ్ఐ సంఘీభావం తెలుపుతుందని స్పష్టం చేశారు.
విజయనగరంలో...
విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద రైతు సంఘం నాయకులు నిరసన చేపట్టారు. ఈ దీక్షలు డిసెంబర్ 30 వరకు కొనసాగుతాయని సంఘం నాయకులు బుద్ధరాజు రాంబాబు, చల్లా జగన్ తెలిపారు. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.