TENSION AT ANANTAPUR : అనంతపురం జిల్లా కుందుర్పి మండలం జంబుగుంపల గ్రామంలో రాత్రి నుంచి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గ్రామంలో ఆదివారం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు ఆధ్వర్యంలో "ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి" కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన వన్నూరప్ప అనే కార్యకర్త ఇటీవలే వైఎస్సార్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు. తన భార్య మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో ఆయా ఉద్యోగం కోసం రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉష శ్రీ 50 వేలు లంచం అడిగిందని గ్రామ సభలో ఆరోపించారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
"మంత్రి గారి పైనే ఆరోపణలు చేస్తావా".. టీడీపీ కార్యకర్తపై దాడి.. పవర్ కట్ చేసిన పోలీసులు - TENSION AT ANANTAPUR
POLICE PICKET AT ANANTAPUR : అనంతపురంలో పోలీస్ పికెట్ కొనసాగుతూనే ఉంది. మంత్రి ఉషశ్రీ చరణ్ పై వన్నూరప్ప అనే వ్యక్తి తీవ్ర ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆగ్రహించిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు అతడిపై దాడికి యత్నించారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు.
వన్నూరప్ప వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న మొన్నటి వరకు వైసీపీలోనే ఉండి ఇప్పుడు మంత్రి పైన ఆరోపణలు చేస్తావా అంటూ అతడిపై జంబుగుంపల గ్రామంలో ఉన్న కొంతమంది గ్రామ స్థాయి నాయకులు అతడిపై దాడికి ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న ఇరుగు పొరుగు గ్రామాలకు చెందిన టీడీపీ కార్యకర్తలు ప్రధానంగా మహిళలు ఏకమై వైఎస్సార్సీపీ వారిపై ఎదురు దాడికి ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన పోలీసులు గంట సేపు శ్రమించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మళ్లీ గొడవలు జరుగుతాయనే ఉద్దేశంతో రాత్రి నుంచి మండలంలో విద్యుత్ సరఫరా నిలిపివేసి పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. పరిస్థితిని పోలీసు అధికారులు సమీక్షిస్తున్నారు.
ఇవీ చదవండి: