అనంతపురం జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద సాగు చేస్తున్న పండ్ల తోటలను పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజాశంకర్ పరిశీలించారు. నార్పల మండల కేంద్ర పరిధిలోని రైతులు చెన్నారెడ్డి, హరికృష్ణారెడ్డి సాగు చేస్తున్న మామిడి తోటలను సందర్శించారు. రైతులతో మాట్లాడి మెుక్కల సంరక్షణ చేపడుతోన్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. పండ్ల తోటల్లో అంతర్ పంటలను కచ్చితంగా సాగు చేయాలన్నారు. దీని ద్వారా రైతులకు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. పొలం చుట్టూ, గట్ల మీద వాతావరణానికి తగ్గట్టుగా మెుక్కల పెంపకం చేపట్టాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద హార్టికల్చర్ ప్లాంటేషన్ కోసం మూడేళ్లకు ఒక ఎకరాకు నీటి సరఫరా, మందులు, మొక్కల సంరక్షణ కోసం ఒక లక్ష 62 వేలు ఖర్చు పెడుతోందన్నారు. మొక్కల నాటడం నుంచి పంట వచ్చేవరకూ మొక్కల సంరక్షణ బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటోదన్నారు. కమిషనర్ వెంట స్పెషల్ కమిషనర్ శాంతి ప్రియ పాండే, జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి తదితరులు ఉన్నారు.