కేంద్రం పరిమితులు
ఎన్నడూ లేని స్థాయిలో ఉల్లిధరలు పెరగడంతో ప్రజలు నానా పాట్లు పడుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం కూడా ఏమి చేయలేని పరిస్థితి. ఓవిధంగా చెప్పాలంటే చేతులెత్తేసినట్టు. జనవరిలో ఖరీఫ్ పంట చేతికందే వరకు పరిస్థితి ఇలానే ఉండొచ్చని తెలుస్తోంది. ఈలోగా పరిస్థితులు చేయిదాటకుండా ఉండటానికి , దేశీయ విపణిలో ఉల్లి సరఫరా పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చిల్లరవ్యాపారుల వద్ద ఉల్లినిల్వల పరిమితి 2 టన్నులకు తగ్గిస్తూ.. ఆదేశాలు జారీ చేసింది. చిల్లర వర్తకులు అక్రమంగా ఉల్లి నిల్వలు ఉంచకుండా.. రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని.. కేంద్రం ఆదేశించింది. ఉల్లి నిల్వల పరిమితిని చిల్లర వర్తకుల వద్ద 10 టన్నుల నుంచి 5 టన్నులకు, టోకు వ్యాపారుల వద్ద 50 టన్నుల నుంచి 25 టన్నులకు కుదిస్తూ గతవారం ఆదేశాలు జారీ చేసిన కేంద్రం... ఇప్పుడు చిల్లర వర్తకుల వద్ద నిల్వ పరిమితిని రెండు టన్నులకు కుదించింది.
ప్రభుత్వ చర్యలేవి
అసలు ఈ స్థాయిలో ఉల్లి సంక్షోభం తలెత్తడానికి కారణాలు చాలానే ఉన్నా... అందులో ప్రధానంగా కనిపించేది మాత్రం ప్రభుత్వం ముందుగా అప్రమత్తంగా లేకపోవడం ఒకటి. ఈ ఉల్లి సంక్షోభం ఇప్పుడు కొత్తగా వచ్చిందేం కాదు. గతంలోనూ ఇలాంటి కొరతలు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి. కాని అప్పటి అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్నట్టు కనిపించలేదు. ఎప్పటికప్పుడు సంక్షోభం నుంచి బయటపడేందుకు మార్గాలు చూసుకోవడమే తప్ప భవిష్యత్‌లో సమస్య పునరావృతం కాకుండా చేసే ప్రయత్నాలు కనిపించడంలేదు. ప్రస్తుతం ఉల్లి సంక్షోభంలో ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు కంటి తుడుపును తలపిస్తున్నాయి.
ధరల్లో వ్యత్యసం
ఈ ఏడాది ఆగస్ట్ 29 నాటికి 2018-19 జున్-జులై కాలంలో ఉల్లి ఉత్పత్తి 23.28 మిలియన్ టన్నులుంటందని అంచనా వేసింది వ్యవసాయ మంత్రిత్వ శాఖ. గతేడాదితో పోలిస్తే అతి స్వల్పమైన పెరుగుదల ఇది. గతేడాది అంచనాలు 23.26 మిలియన్ టన్నులుగా ఉంది. అక్టోబర్ -మార్చిలో పండే పంటలో దాదాపు 65% ఏప్రిల్-అక్టోబర్లో వాడకానికి నిల్వ చేస్తారు . అయితే మహారాష్ట్ర, కర్ణాటకలో అకాల వర్షాలతో రబీ పంటకి భారీనష్టం వచ్చింది. ఆ ప్రభావం ఖరీఫ్ పంటపై కూడా పడేలా చేశాయి. 2012లో-13లో 16.81 మిలియన్ టన్నులుగా ఉన్న ఉత్పత్తి 2018-19 నాటికి 23.48 మిలియన్ టన్నులకు చేరుకుంది. అంటే 40% పెరుగుదల కనిపించింది. ఉత్పత్తి ఎక్కువగా జరగడం వలన ధరలు పడిపోయి ఉల్లి రైతులు నష్టాలు మూటగట్టుకోవాల్సి వచ్చింది.
ఆధునిక విధానాల్లో నిల్వ
దేశవ్యాప్తంగా సాధారణంగా ఉల్లి వినియోగం నెలకు 15 నుంచి 16లక్షల టన్నులుంటుంది. కాని గోదాముల్లో నిల్వఉంచేది మాత్రం పదిలక్షల టన్నులే. సంక్షోభం సమయంలో ఇవి ఏమూలకు సరిపోతాయన్నది పాలకులకే తెలియాలి. అలానే ఉల్లి పంపిణీకి సంబంధించి సరైన మౌలిక సౌకర్యాలు లేవు. ప్రజా పంపిణీ వ్యవస్థ తప్ప మరో మార్గం లేదు. ఇప్పుడు ఏ ప్రభుత్వం కూడా చౌక ధరల దుకాణాల ద్వారా ఉల్లిని సరఫరా చేసేందుకు సిద్ధంగా లేదు. ఉల్లి సంక్షోభాన్ని ఎదుర్కోవాలంటే నిల్వ చేసే విధానాలు మారాలి. ఆధునిక పద్ధతుల్లో నిల్వ చేయడంవల్ల రబీలో పంట నష్టం నుంచి కోలుకోవచ్చని చెబుతున్నారు. ఇప్పుడు నిల్వ చేస్తున్న పద్దతుల వల్ల దాదాపు 30 నుంచి 40శాతం ఉల్లి పాడైపోతున్నాయి.