అనంతపురం జిల్లా విడపనకల్ మండల కేంద్రంలోని ఎరువుల దుకాణం లైసెన్స్ రెన్యూవల్ కోసం సంబంధిత అధికారులు డబ్బులు అడిగిన ఆడియో.. సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. సంతకాల కోసం ఉన్నతాధికారి కార్యాలయం చుట్టూ తిరగాలని, ఖర్చులు ఉంటాయని ఆ అధికారి పేర్కొనగా... తాను చిన్న డీలర్ అని ఇప్పటికే సీజన్ మామూలు ఇచ్చానని.... మధ్యలో రెండు, మూడుసార్లు డబ్బులు ఇచ్చినట్లు దుకాణదారుడు వేడుకున్నాడు.
వ్యవసాయశాఖ అధికారి, ఎరువుల దుకాణ యజమానికి మధ్య జరిగిన ఈ సంభాషణను కొందరు వ్యక్తులు వ్యవసాయ శాఖ కమిషనర్, జేడీఏలకు పంపించారు. విడపనకల్ మండలంలోనే దాదాపు 38 ఎరువుల దుకాణాలు ఉంటే ఒక్కొక్క దుకాణదారుడి నుంచి సంవత్సరానికి రూ.30 నుంచి రూ.40 వేలు వసూలు చేస్తున్నారని బాధితులు ఆరోపించారు. తమకు తగిన న్యాయం చేయాలని కోరారు.