School Construction Work Stopped: జరుగుతున్న పనులకు భూమిపూజ నిర్వహించి.. ఒక్క రూపాయి కూడా నిధులివ్వని వైఎస్సార్సీపీ ప్రభుత్వ డొల్లతనం.. మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల రూపంలో మరోసారి బయటపడింది. గుంతకల్లులో ముస్లిం మైనార్టీ జనాభా అధికంగా ఉండటంతో గత టీడీపీ ప్రభుత్వంలో 18 కోట్ల రూపాయల వ్యయంతో మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. భవన నిర్మాణం ప్రారంభం కాగానే ప్రభుత్వం మారిపోయి, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కొలువుదీరింది.
భూమిపూజ చేసిన పనులకు అనంతపురం జిల్లా పర్యటనలో మరోసారి రిమోట్ పద్ధతిలో సీఎం జగన్ భూమి పూజ నిర్వహించారు. భూమి పూజ అయితే చేశారు కానీ.. నిధులు మాత్రం విడుదల చేయలేదు. దీంతో అనంతపురం జిల్లా గుంతకల్లులో మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణం నిలిచిపోయింది.
మైనార్టీల్లో అక్షరాస్యత పెంచటానికి: అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణం.. విసిరిపడేసినట్లుగా కర్నూలు జిల్లా సరిహద్దులో ఉంటుంది. తీవ్ర వర్షాభావంతో కరవు ప్రాంతంగా గుర్తించిన గుంతకల్లు నియోజకవర్గంలో.. అక్షరాస్యత తక్కువగా ఉండటమే కాకుండా, ఉపాధి కోసం వేలాది మంది బెంగళూరు, ముంబైలకు వెళుతుంటారు. ఇంతటి దుర్భిక్ష ప్రాంతంలో ప్రధాన పట్టణంగా ఉన్న గుంతకల్లులో మైనార్టీల సంఖ్య అధికంగా ఉంటుంది. మైనార్టీల్లో అక్షరాస్యత పెంచటానికి టీడీపీ ప్రభుత్వం ఆ వర్గాల పేద పిల్లలు చదువుకోటానికి అవకాశం కల్పించాలని భావించింది.
మరోసారి రిమోట్‌తో: గుంతకల్లులోని కసాపురం రహదారిలో మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటుకు అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భూసేకరణ చేసి 18 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో గుత్తేదారుకు పనులు అప్పగించింది. ఈలోపే ఎన్నికలు రావటం, వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొలువుదీరటంతో పనులు నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే సీఎం జగన్ మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చినపుడు, గతంలో భూమి పూజ చేసిన మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలకు, జగన్ మరోసారి రిమోట్‌తో భూమి పూజ చేశారు.