ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కదిరి బైపాస్‌ టెండర్‌ ఉపసంహరణకు ఒత్తిళ్లు

అనంతపురం జిల్లాలోని కదిరి పట్టణం చుట్టూ నిర్మించనున్న బైపాస్‌ రోడ్డు పనులు దక్కించుకుకోవాలని ముందే వ్యూహం సిద్ధం చేసిన ఓ సంస్థ.. పోటీగా వచ్చిన మరో సంస్థను తప్పించేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.

kadiri bypass road works
కదిరి బైపాస్‌ టెండర్‌ ఉపసంహరణకు ఒత్తిళ్లు

By

Published : Sep 12, 2020, 10:13 AM IST

అనంతపురం నుంచి కదిరి, మదనపల్లి, కుప్పం మీదుగా తమిళనాడు సరిహద్దు వరకు వెళ్లే జాతీయ రహదారి-42లో భాగంగా కదిరి పట్టణంలోకి వాహనాలు వెళ్లకుండా బైపాస్‌రోడ్డును నిర్మించనున్నారు. 12.578 కి.మీ. మేర రెండు వరుసలతో బైపాస్‌ నిర్మాణానికి రూ.126.39 కోట్ల అంచనా వ్యయంతో జులైలో టెండర్లు పిలిచారు. ఆన్‌లైన్‌లో టెండర్ల దాఖలు గడువు ఈ నెల 14తో ముగియనుంది. మరోవైపు ఈ పనులను అనంతపురం జిల్లాకు చెందిన ఓ గుత్తేదారు సంస్థకు దక్కేలా ముందే మాట్లాడుకున్నారు. ఇతర సంస్థలు బరిలో నిలవకుండా చూస్తున్నారు. ఇందుకు అధికార పార్టీతోపాటు, మరో పార్టీ నేతలు కూడా సహకరిస్తున్నట్లు తెలిసింది. అయితే పొరుగు జిల్లాకు చెందిన మరో సంస్థ తాజాగా టెండరు దాఖలు చేసింది. అది ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతకు చెందినది కావడంతో.. ఆ సంస్థను బరి నుంచి తప్పించేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు.

పత్రాలు సమర్పించగానే ఒత్తిళ్లు

పొరుగు జిల్లా గుత్తేదారు సంస్థ ఆన్‌లైన్‌లో దాఖలు చేసిన టెండరుకు సంబంధించిన కొన్ని పత్రాలను నిబంధనల ప్రకారం అనంతపురంలోని ఎస్‌ఈ (జాతీయ రహదారులు) కార్యాలయంలో శుక్రవారం అందజేసింది. అక్కడి అధికారులు తొలుత ఆ పత్రాలు తీసుకొని రశీదు ఇచ్చేందుకు అంగీకరించలేదని తెలిసింది. ఎందుకు తీసుకోరని గట్టిగా నిలదీయడంతో చివరకు రశీదు ఇచ్చారు. దీంతో ఈ సంస్థ బరిలో ఉందనేది తెలిసింది. వెంటనే టెండరుదక్కించుకోవాలనుకుంటున్న సంస్థ రంగంలోకి దిగింది. టెండరు ఉపసంహరించుకోవాలంటూ ఒత్తిళ్లు చేస్తున్నట్లు సమాచారం. రాయబారాలు, చర్చలు జరుపుతున్నారు. సోమవారంలోపు ఉపసంహరణపై ఎలాగైనా ఒప్పించాలని చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ సంస్థ మాత్రం బరిలో నిలవాలని భావిస్తున్నట్లు తెలిసింది.

ఇదీ చదవండి:ఫలించిన గుత్తేదారుల ముందస్తు వ్యూహం!

ABOUT THE AUTHOR

...view details