వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో అరెస్టైన జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డి బెయిలుపై విడుదలయ్యారు. ఈ మేరకు కడప కేంద్ర కారాగారం నుంచి సాయంత్రం 6 గంటలకు జైలు నుంచి బయటికి వచ్చారు. బుధవారం అనంతపురం కోర్టు వీరిద్దరికీ బెయిలు మంజారు చేయగా... జేసీ తరఫున న్యాయవాదులు బెయిలు పత్రాలు తీసుకుని సాయంత్రం కడప జైలుకు వచ్చారు. అన్ని పత్రాలను పరిశీలించిన అధికారులు జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిని విడుదల చేశారు.
54 రోజుల పాటు కడప కేంద్ర కారాగారంలో రిమాండు ఖైదీలుగా ఉన్న వీరిద్దరూ గురువారం విడుదలయ్యారు. జేసీకి స్వాగతం పలికేందుకు తాడిపత్రి నుంచి పార్టీ కార్యకర్తలు, అనుచరులు భారీగా తరలివచ్చారు. జేసీ దివాకర్ రెడ్డి తనయుడు పవన్ కుమార్ రెడ్డి జైలు వద్దకు వచ్చారు. భారీ సంఖ్యలో కార్యకర్తలు రావటంతో పోలీసులు వారందరినీ చెదరగొట్టారు. కరోనా సమయంలో పెద్ద సంఖ్యలో గుమికూడదన్న నిబంధన ఉన్న కారణంగా పోలీసులు అందరినీ పంపించేశారు. బయటకు వచ్చిన ప్రభాకరరెడ్డికి పూలమాల వేసి స్వాగతం పలికారు.
పోలీసులపై జేసీ ఆగ్రహం
తమ అనుచర గణంతో జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్ రెడ్డిలు తాడిపత్రికి చేరుకున్నారు. తాడిపత్రి మండలం బొందలదిన్నె గ్రామంలో పోలీసులు అన్ని వాహనాలకు అనుమతి ఇవ్వకపోవడం వల్ల జేసీ అనుచరులు రోడ్డుపై బైఠాయించారు. ఈ క్రమంలో పోలీసుల తీరుపై జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసేది లేక పోలీసులు అన్ని వాహనాలను అనుమతించారు. అనంతరం కాన్వాయ్‌తో జేసీ పట్టణంలోకి చేరుకున్నారు. పట్టణంలో అడుగడుగునా కార్యకర్తలు బాణాసంచా కాలుస్తూ.. పూలు చల్లుతూ వీరికి ఘనస్వాగతం పలికారు.