చంద్రబాబును (CHANDRA BABU) మళ్లీ సీఎం పీఠంపై కూర్చోబెట్టడమే లక్ష్యమని.. తెలుగుదేశం నేత జేసీ ప్రభాకర్ రెడ్డి (JC PRABHAKAR REDDY) అన్నారు. పార్టీ కోసం పనిచేసే వారితో కలిసి పల్లె పల్లెకు తిరుగుతామని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. తెదేపాలో తమకు పదవులు ఇచ్చినా, ఇవ్వకపోయినా పార్టీ బలోపేతం చేయటానికి నిర్ణయించినట్లు తెలిపారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో స్థానిక సంస్థల్లో పోటీ చేసి గెలుపు, ఓటములు పొందిన తెదేపా మద్దతుదారులను జేసీ కుటుంబ సభ్యులు ఘనంగా సన్మానించారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేయటంలో భాగంగా అనంతపురంలో పదివేల మంది కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.
ఫ్లెక్సీలకు బదులు విద్యార్థులకు పుస్తకాలివ్వండి..
వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS RAJASEKHAR REDDY) హయాంలో తాను మున్సిపల్ ఛైర్మన్ కాగా, చంద్రబాబు దయతో తనకు ఎమ్మెల్యే అవకాశం పదవి దక్కిందన్నారు. రాజకీయ నాయకులు ఫ్లెక్సీల కోసం పెట్టే ఖర్చును పేద విద్యార్థులకు పుస్తకాలు కొనివ్వాలని తెదేపా వర్గాలకు సూచించారు. రాజకీయాల్లో ఎదగాలనుకుంటే పదవి ఉన్నా.. లేకపోయినా నిత్యం ప్రజల్లో ఉండాలన్నారు. కొందరు పార్టీని నిర్వీర్యం చేస్తూ, పెత్తనం చేయటానికే పదవులను దక్కించుకుంటున్నారని సొంత పార్టీపైనే వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడును (CBN) మళ్లీ సీఎం చేయటమే లక్ష్యంగా తాను, తన కుటుంబం పని చేస్తోందని స్పష్టం చేశారు. అధికార పార్టీ దౌర్జన్యాలకు, పోలీసుల బెదిరింపులకు ఎదురొడ్డి తెదేపా మద్దతుదారులు స్థానిక ఎన్నికల్లో పోటీకి నిలిచారని అనంతపురం పార్లమెంటు తెదేపా ఇన్ ఛార్జి జేసీ పవన్ కుమార్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిలు అన్నారు. ఎన్ని బెదిరింపులు ఎదురైనా తెదేపా మద్దతు అభ్యర్థులుగా పోటీలో నిలిచిన వారంతా వీరులేనని జేసీ కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.