అనంతపురం జిల్లాలో జనం నీటి కోసం రోడ్ల మీదకి వస్తున్నారు. నీటి పథకాలు ఉన్న ఉపయోగం లేదు. ఉన్నంతలో ట్యాంకర్లతో నీరు సరఫరా చేస్తున్నారు.
- తలుపుల మండలంలోని గొల్లపల్లితండా పంచాయతీలో పది రోజులుగా నీటి పథకం విద్యుత్తు మోటారు మరమ్మతులకు గురైంది. రెండుసార్లు బాగు చేసినా ప్రయోజనం లేక ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నారు. మంగళవారం గ్రామానికి వచ్చిన ట్యాంకర్ వద్ద ప్రజలు బారులు తీరారు. ఇప్పుడే ఇలా ఉంటే, మరో రెండు నెలల్లో సమస్య తీవ్రరూపం దాల్చే వీలుంది. ఇదే మండలంలో రోజుకు 319 ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నా కష్టాలు తప్పడం లేదు.
- వీటి పరిధిలో అధికంగా నీటిని వినియోగించిన గ్రామాలు 81 ఉండటం గమనార్హం
పాతాళానికి ప్రాణజలం - నిరుడు ఆగస్టులో భూగర్భ జలాలు గరిష్ఠంగా 27.75 మీటర్ల లోతున ఉండేవి. సెప్టెంబరు, అక్టోబరులో వర్షాలకు 16.0 మీటర్లకు ఎగబాకాయి. అయితే ఫిబ్రవరి నుంచి ఎండలు తీవ్రమై నీటి మట్టాలు తగ్గుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో జిల్లా సగటు నీటిమట్టం 17.92 మీటర్లు కాగా.. ఏప్రిల్ 14 నాటికి 19.28 మీటర్ల లోతుకు ఇంకిపోయాయి. మూడు నెలల్లో 1.36 మీటర్ల మేర భూగర్భ జలమట్టం తగ్గింది.
తెగ తోడేస్తున్నారు
జిల్లా నుంచి వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన వారు లాక్‌డౌన్‌తో సొంతూళ్లకు తిరిగి వచ్చారు. దీంతో జనాభా అధికమై నీటి అవసరాలు పెరిగాయి. దీనికితోడు వ్యవసాయ గొట్టపు బావుల ద్వారా అధికంగా నీటిని వాడటమూ ఓ కారణం. ఫలితంగా భూగర్భ జలాలు తగ్గుతూ రోజువారీ అవసరాలకూ నీరు గగనం అవుతోంది.