ఉత్తరాదిలో కుండపోత వర్షాలు ముంచెత్తుతుంటే అనంతపురం జిల్లాలో మాత్రం చినుకు రాలటంలేదు. ఈ నెల 7వ తేదీన నైరుతి రుతుపవనాలు రాయలసీమ జిల్లాలోకి ప్రవేశించి, 11వ తేదీలోపు రాష్ట్రమంతటా విస్తరించాయి. రుతుపవనాలు ప్రవేశించి, విస్తరణ సమయంలోనే అనంతపురం జిల్లాలో పుష్కలంగా వర్షాలు కురిసే పరిస్థితి గత కొన్నేళ్లుగా కొనసాగుతోంది. అయితే ఈసారి రుతుపవనాలు ప్రవేశించాక జిల్లా వ్యాప్తంగా ఎక్కడా పుష్కలంగా వర్షాలు నమోదుకాలేదు. అల్పపీడన ప్రభావంతో ఈనెల 2వ తేదీ రాత్రి అనంతపురం జిల్లా పడమర ప్రాంతాలైన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పలు మండలాల్లో 50 మిల్లీ మీటర్ల వరకు వర్షం కురిసింది.
ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా కేవలం 12 మండలాల్లో మాత్రమే ముప్ఫై నుంచి 50 మిల్లీమీటర్ల వర్షం నమోదుకాగా, ఇతర మండలాల్లో కేవలం ఏడు మిల్లీ మీటర్ల సాధారణ వర్షం నమోదైంది. జిల్లాలో పలు ప్రాంతాల్లో కొద్దిపాటి జల్లులకు విత్తనాలు వేసిన రైతులు...వర్షం కోసం ఎదురుచూస్తున్నాయి. ఓవైపు మేఘాలు ఊరిస్తుండగా, మరోవైపు విపరీతమైన గాలితో విత్తనాలు వేసిన పొలాల్లో నేల పొడిబారిపోతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పది రోజులుగా చినుకురాలని పరిస్థితిపై అనంతపురం జిల్లా రేకులకుంట వ్యవసాయ పరిశోధనా కేంద్రం వాతావరణ శాస్త్రవేత్త డా.మల్లీశ్వరితో ముఖాముఖి.
ఈటీవీ భారత్ : రోజూ దట్టమైన మేఘాలు కనిపిస్తున్నాయి. కానీ వర్షం పడడంలేదు కారణం ఏమంటారు?
డా.మల్లీశ్వరి : ఈనెల 7న నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించి, 11వ తేదీన రాష్ట్రమంతటా విస్తరించాయి. అదే సమయంలో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి, అది ఉత్తర దిశగా చురుకుగా వెళ్లటంతో ఉత్తరాది రాష్ట్రాల్లో పుష్కలంగా వర్షాలు కురుస్తున్నాయి. దాని ప్రభావం వల్ల రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురవని పరిస్థితి నెలకొంది.
ఈటీవీ భారత్: నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన సమయంలో అనంతపురం జిల్లాలోని పడమర దిశలోని ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. అనంతరం చినుకురాలని పరిస్థితి నెలకొంది? ఎందుకంటారు?
డా.మల్లీశ్వరి : నైరుతి రుతుపవనాలు ప్రవేశించాక పడమటి గాలి తీవ్రత పెరిగింది. గాలి వేగం గంటకు 18 కిలోమీటర్ల వరకు ఉంది. దీనివల్ల మేఘాలు దట్టంగా వచ్చినప్పటికీ అవి వర్షాన్ని కురిపించకుండానే వెళ్లిపోతున్నాయి.
ఈటీవీ భారత్: రానున్న వారం రోజుల్లో వర్షపాత అంచనాలు ఎలా ఉన్నాయి ?
డా.మల్లీశ్వరి: ప్రతి గురువారం వాతావరణ విభాగం ముందస్తు అంచనాలు ప్రకటిస్తుంది. దీని ప్రకారం ఈనెల 19 నుంచి 25 వరకు అనంతపురం జిల్లాలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. జులై నెలలో వర్షాలు కురుస్తాయని ముందస్తు అంచనాలున్నాయి.