power cuts: అనంతపురం జిల్లాలో అత్యధిక మందికి జీవనోపాధి కల్పిస్తున్న పరిశ్రమల్లో.. జీన్స్ దుస్తుల తయారీ తొలిస్థానంలో ఉండగా, చేనేతది రెండోస్థానం. రాయదుర్గంలో రెండున్నర దశాబ్దాలుగా విస్తరించిన జీన్స్ ప్యాంట్ల తయారీ పరిశ్రమ... కరోనాకు ముందు 12 వేల మంది వరకు ఉపాధి కల్పించేది. నోట్ల రద్దు, కరోనా మహమ్మారి ఈ పరిశ్రమను కోలుకోలేని దెబ్బతీశాయి. కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే తిరిగి కోలుకుంటున్న పరిశ్రమలపై.... విద్యుత్ కోతలు కోలుకోలేని దెబ్బతీస్తున్నాయని పరిశ్రమ యజమానులు అంటున్నారు. దీనిపై ఆధారపడిన కూలీలు సైతం ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.
కోతలతోసరఫరా చేయలేక : రాయదుర్గంలో దాదాపు 200 జీన్స్ ప్యాంట్లు తయారు చేసే భారీ పరిశ్రమలు ఉన్నాయి. ఇవి కాకుండా 700 చిన్నపాటి పరిశ్రమలు, మరో వెయ్యి వరకు కుటీర పరిశ్రమలు ఉన్నాయి. రెండు నెలలుగా విధిస్తున్న విద్యుత్ కోతల కారణంగా.. భారీ పరిశ్రమ నుంచి కుటీర పరిశ్రమ వరకు అన్నీ తీవ్రంగా నష్టపోతున్నాయి. సిల్క్ దారం పరిశ్రమల్లో కూడా.... వచ్చిన ఆర్డర్లకు దారం సరఫరా చేయలేక ఇబ్బంది పడుతున్నామని పరిశ్రమ యజమానులు అంటున్నారు.