ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఆక్రమణలో రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూములు

By

Published : Jul 8, 2020, 9:37 AM IST

కోట్ల రూపాయల విలువైన భూమి అది. ఎన్ని చేతులు మారినా.. చివరికి ప్రభుత్వ భూమే. దీన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకోవాలని హైకోర్టు ఆరేళ్ల క్రితమే తీర్పునిచ్చింది. అప్పటి నుంచి రెవెన్యూ అధికారులు పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. పేదలు వేసుకున్న గుడిసెలు చకచకా తొలగించారే తప్ఫ. పెద్దలు ఆక్రమించుకున్న స్థలాన్ని స్వాధీనం చేసుకోలేక రెవెన్యూ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. గుడిసెలకు పట్టాలిస్తామని ఆశ చూపి పెద్దలు ఆక్రమించుకునేలా పురికొల్పారు. దాదాపు రూ.10 కోట్ల విలువైన భూమి కబ్జాదారుల చేతుల్లోకి చేరింది. అనంతపురం గ్రామీణ మండలం సోమలదొడ్డి గ్రామంలో ఈ భూమిపై వివాదాలు చుట్టుముట్టాయి.

illegal lands
illegal lands

పేదలను ఖాళీ చేయించి.. పెద్దలను వదిలిపెట్టి..

సోమలదొడ్డి రెవెన్యూ గ్రామం సర్వే నెం.112లో 10.43 ఎకరాల అసైన్‌మెంటు భూమి ఉంది. ఈ భూమి గతంలో మాజీ సైనికులకు పంపిణీ చేశారు. వారి తాలూకూ వారసులు ఎవరూ లేకపోవడంతో నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలు సృష్టించి అమ్మకాలు చేశారు. ఈ సర్వే నెంబరులో మొత్తం ఏడు సబ్‌డివిజన్లు ఉన్నాయి. అందులో బాలనేరస్థుల పాఠశాలకు రెండు ఎకరాలు ఇచ్చారు. మరో రెండు ఎకరాల భూమిని గతంలో పనిచేసిన తహసీల్దార్లు కోటీశ్వరులైన వారికి పట్టాలు ఇచ్చారు. మిగిలిన భూమిలో ఏడాది క్రితం సీపీఐ ఆధ్వర్యంలో గుడిసెలు వేశారు. ఈ గుడిసెలను తొలగించడానికి రాజకీయ నాయకులు అనేక ఎత్తులు వేశారు. ప్రస్తుతం అక్కడ ఎకరా విలువ రూ.1.5 కోట్ల వరకు ఉంది. మీకు మూడెకరాల్లో పట్టాలు ఇప్పిస్తాం.. రెండువైపులా ఖాళీ చేయండని వారిని పురమాయించారు. నాయకుల మాయ తెలియని పేదలకు గుడిసెలు స్వచ్ఛందంగా తొలగించుకున్నారు. వెంటనే 1.24 ఎకరాల భూమికి ఓ వ్యాపారి, రెండు ఎకరాలకు మరో వ్యక్తి కంచె వేసుకున్నారు. పేదలు వేసుకున్న గుడిసెల్లో కొన్నింటిని పోలీసులు సమక్షంలో తొలగించారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న భూమిలో సోమలదొడ్డి గ్రామానికి చెందిన పెద్దలకే పట్టాలు ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నారు. మిగిలిన గుడిసెలను కూడా దౌర్జన్యంగా తొలగించడానికి ప్రయత్నాలు ముమ్మురం చేశారు.

పేదల సామాన్లు బయటికి విసిరేసి..

కొందరు పేదలు పక్కా ఇళ్లను నిర్మించుకుని కాపురం చేస్తున్నారు. వారిని ఖాళీ చేయించడానికి అనేక ఎత్తులు వేస్తున్నారు. పేదల ఇళ్లను యథాతథంగా ఉంచాలని హైకోర్టులో స్టే తెచ్చినా కూడా దౌర్జన్యాలు ఆగలేదు. అందరూ ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఇళ్లలోని సామాన్లను బయటకు విసురుతున్నారు. గత సోమవారం అదే జరిగింది. పోలీసులు కూడా స్థానిక నాయకుల దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేయలేక విమర్శలు ఎదుర్కొంటున్నారు. హైకోర్టుల తీర్పును కూడా గౌరవించకుండా విచక్షణారహితంగా దాడులకు పాల్పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆ భూములను స్వాధీనం చేసుకుంటాం

సోమలదొడ్డి గ్రామంలో ఆక్రమించుకున్న భూములను ఎపుడైనా స్వాధీనం చేసుకుంటాం. దీనికి సంబంధించిన కేసు కోర్టులో నడుస్తోంది. ఖాళీగా ఉన్న స్థలాలను పేదలకు ఇవ్వడానికి నిర్ణయించాం. స్థానికులకే పట్టాలు ఇవ్వాలని వివాదం నడుస్తోంది. పెద్దలు ఆక్రమించుకున్న భూములపై సమగ్ర విచారణ జరిపిస్తాం. - ఈశ్వరప్పశెట్టి, తహసీల్దారు

ఇదీ చదవండి:పరీక్షించిన ప్రతి 100లో 7.11 మందికి కరోనా

ABOUT THE AUTHOR

...view details