ఆన్లైన్లో మట్కా యాప్‌లు తయారు చేసి మట్కా నిర్వహిస్తున్న ముఠా గుట్టును అనంతపురం జిల్లా హిందూపురం పోలీసులు రట్టు చేశారు. హిందూపురానికి చెందిన బొట్టు మంజు 2019లో ఆఫ్ లైన్లో మట్కా నిర్వహించేవాడు. అప్పుడు పోలీసుల నుంచి తప్పించుకున్న బొట్టు మంజు హైదరాబాదులోని యానిమేషన్ ఇంజనీర్ సహాయంతో మట్కా నిర్వహణ కోసం సరికొత్తగా గా 2 వెబ్ పేజీలను తయారు చేయించుకున్నాడు. అనంతరం ఆన్లైన్లో మట్కా నిర్వహణ కొనసాగిస్తున్నాడు.
ఇదీ పసిగట్టిన హిందూపురం వన్ టౌన్ పోలీసులు.. ఆన్లైన్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. మంజు ఆన్లైన్ వెబ్ పేజీలు తయారుచేసిన యానిమేషన్ ఇంజనీర్ షబ్బీర్‌తో పాటు మరో పది మందిని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి పెనుకొండ సబ్ డివిజన్ డీఎస్పీ రమ్య వివరాలను వెల్లడించారు.