అనంతపురం జిల్లాలోని పలు ప్రాంతంల్లో శుక్రవారం వర్షం బీభత్సం సృష్టించింది. రొద్దం పరిధిలోని బూచర్ల గ్రామం నుంచి మండల కేంద్రానికి వెళ్లే రోడ్డు శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కోతకు గురైంది. అధికారిక లెక్కల ప్రకారం రొద్దం మండల వ్యాప్తంగా శుక్రవారం 57 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. కోతకు గురైన రోడ్డులో ప్రయాణం సాగించేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
త్వరితగతిన వంతెన కావాలి..
గొల్లపల్లి జలాశయం నుంచి పేరూరు డ్యామ్‌కు కృష్ణా జలాలను తరలించే క్రమంలో మార్గంమధ్యలో ఏర్పాటు చేసిన కల్వర్టును తొలగించారు. ఈ మేరకు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రోడ్డు వర్షానికి పూర్తిగా కొట్టుకుపోయింది. ఈ మార్గంలో ప్రయాణించే బూచర్ల నాగిరెడ్డి పల్లి, కనుమర, కుర్లపల్లి, నారా నాగేపల్లి గ్రామాల ప్రజలు ఉదయాన్నే రొద్దంలోని వార సంతకు వచ్చారు. తిరుగు ప్రయాణంలో కోతకు గురైన రోడ్డులో అడ్డంగా పారుతున్న వర్షపు నీటిలో దిగి ఇబ్బందికరంగా ప్రయాణించాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వంతెన నిర్మాణం త్వరగా చేయాలని కోరుతున్నారు.
కృష్ణా జిల్లాలో..
కృష్ణా జిల్లా మైలవరంలోని మార్కెట్ యార్డులో రాత్రి వర్షానికి ధాన్యం తడిచిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ యార్డులో వసతుల లేమి, టార్ఫాలిన్ కవర్లు సైతం లేకపోవడంతో ధాన్యానికి భద్రత కరువైంది. రైతులు నిస్సహాయ స్థితిలో చేసేది లేక తడిచిన ధాన్యాన్ని యార్డులోనే వదిలేసి బాధతో వెళ్లారు.