అనంతపురం జిల్లా రాయదుర్గంలో జరిగిన అగ్నిప్రమాదంలో.. ఓ గోదాం కాలి బూడిదైంది. ఈ తెల్లవారుజామున గోదాంలో మంటలు... ఎగిసిపడ్డాయి. పక్కనే ఉన్న ఇళ్లకు వ్యాపించాయి. సమీప ఇళ్ల ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. రాయదుర్గం అగ్నిమాపక శకటం అందుబాటులో లేని కారణంగా రెండు గంటల పాటు మంటలు చెలరేగాయి.
అనంతరం... కర్ణాటకలోని మొలకల్మురు నుంచి అగ్నిమాపక శకటాన్ని అధికారులు రప్పించారు. సిబ్బంది దాదాపు 2 గంటల పాటు శ్రమించి మంటలు అదుపుచేశారు. ఈ ప్రమాదంలో రెండు ద్విచక్రవాహనాలు, ఒక కారు అగ్నికి ఆహుతయ్యాయి. సమీపంలోని రెండు ఇళ్లు దెబ్బతిన్నాయి.