ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోటి రూపాయల భూమి.. రూ.60లక్షలే!.. పోలీసుల రాకతో బెడిసికొట్టిన వ్యూహం - అనంతపురం జిల్లాలో ఘరానా మోసం

Preparation of duplicate documents in Anantapur district: నకిలీ పత్రాలను సృష్టించి కోటి రూపాయల విలువచేసే ఇంటి స్థలాన్ని కాజేయాలని కుట్రపన్నిన నలుగురు నిందితులను అనంతపురం గ్రామీణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన ఇంటి స్థలం విషయంలో జరుగుతున్న కుట్రను ముందుగానే తెలుసుకున్న స్థల యజమాని.. పోలీసులకు ఫిర్యాదు చేయటంతో అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

Anantapur district
నకిలీ పత్రాలు సృష్టించి హల్‌చల్

By

Published : Jan 16, 2023, 4:39 PM IST

Preparation of duplicate documents in Anantapur district:

రియల్ మోసాలకు అడ్డూ, అదుపూ లేకుండా పోతోంది. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా ఎంతో విలువైన భూమితో పాటు, లక్షలాది రూపాయలను కోల్పోవాల్సిందే. రియల్ దందాలో భూమి కొన్నా, అమ్మినా అన్ని పత్రాలను ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవాల్సిందే. స్థిరాస్థి క్రయ, విక్రయాల్లో అప్రమత్తత అవసరం. అనంతపురం జిల్లాలో విలువైన భూమికి నకిలీ పత్రాలను సృష్టించి, వేరొకరికి అమ్మజూపిన నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలోని బళ్లారి రహదారిలో కోటి రూపాయల విలువైన ఇంటి స్థలాన్ని కాజేయాలని చూశారనే ఆరోపణలున్నాయి. ప్రైవేట్ సర్వేయర్ రఫిక్ తన స్నేహితుల్లో కొందరికి ఆ స్థలం గురించి చెప్పి, నకిలీ పత్రాలను, అందుకు సంబంధించిన అనుబంధ నకిలీలను సృష్టించాలని భారీ కుట్ర చేశారు. సంబంధిత స్థల యజమాని ముందస్తుగా మేల్కోవడంతో నష్టం తప్పింది.

నకిలీ పత్రాలను సృష్టించి వేరొకరికి రూ.60 లక్షలకు విక్రయించాలని నిర్ణయించారు. నగరానికి చెందిన ఓ వ్యక్తితో బేరం కుదుర్చుకున్నారు. కోటి రూపాయల స్థలాన్ని రూ.60 లక్షలకే ఇస్తున్నట్లు చెప్పి, రూ.15 లక్షలు అడ్వాన్సుగా తీసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఆ లావాదేవీల గురించి తెలుసుకున్న స్థల యజమాని.. అనంతపురం గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో రఫిక్‌తో పాటు మరో ముగ్గురు నిందితులను పోలీసులు ఉరవకొండలో అదుపులోకి తీసుకొని, వారిని అనంతపురం పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి విచారణ ప్రారంభించారు.

ఈ నకిలీ పత్రాల వ్యవహారంలో ఉరవకొండకు చెందిన మరికొందరు ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ భారీ కుట్రను భగ్నం చేసిన పోలీసులు.. నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ జరగకుండా నిలువరించారు. అనంతరం నిందితులు ఉరవకొండలో ఎవరెవరితో తిరిగారు..?, ఎక్కడెక్కడ సమావేశం అయ్యారు..? అనే విషయాలను అధికారులు కూపీ లాగుతున్నారు. నిందితుల వివరాలను పోలీసులు వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details