మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డిని హైదరాబాద్‌లో అనంతపురం పోలీసులు శనివారం అరెస్టు చేశారు. బీఎస్ - 3 వాహనాలను బీఎస్ - 4 వాహనాలుగా రిజిస్ట్రేషన్‌గా చేయించారన్న అభియోగాలపై వారిని అరెస్టు చేశారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ఉదయమే హైదరాబాద్‌లో వారిద్దర్నీ అరెస్టు చేసిన పోలీసులు... పామిడి మీదుగా అనంతపురంలోని ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 వరకు స్టేషన్లోనే విచారించారు. అనంతరం ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిలను భారీ భద్రత మధ్య వైద్య పరీక్షల కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
అభిమానుల ఆందోళన
మార్గ మధ్యలోనే జాతీయరహదారిపై అరెస్టుకు వ్యతిరేకంగా తెలుగుదేశం శ్రేణులు, అభిమానులు ఆందోళనలు చేసిన నేపథ్యంలో.... ముందు జాగ్రత్తగా స్టేషన్ వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులను మొహరించారు. స్టేషన్ సమీపంలో ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా దుకాణాలను మూసేయించారు. విచారణ అనంతరం అక్కడకొస్తున్న.. సమయంలో సమస్యేమీ లేదు అంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి మీడియాతో అన్నారు. అక్రమంగా వాహనాలు రిజిస్ట్రేషన్ చేశారనే ఆరోపణతో అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు.
నేనే లొంగిపోదామనుకున్నా
'ఈ వ్యవహారంలో తప్పుడు కేసలు బనాయించారు. అసలు సూత్రధారులను వదిలేస్తున్నారు. వారిని ఎందుకు వదిలేస్తున్నారో... ఎప్పుడు పట్టుకుంటారో తెలియదు. ఏదేమైనా నేనే లొంగిపోదామనుకున్నా.. ఈలోపు మీరే వచ్చారు.'.... అని అరెస్టు సమయంలో ప్రభాకర్‌రెడ్డి అధికారులతో చెప్పినట్లు ఆయన కుటుంబీకులు తెలిపారు.
ఇప్పటికే 5 కేసుల్లో ముందస్తు బెయిల్
ప్రభాకర్‌రెడ్డిపై నేరుగా ఆరు కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే 5 కేసులకు సంబంధఇంచి ముందస్తు బెయిల్ వచ్చిందని ఆయన తరఫు న్యాయవాది రవికుమార్‌రెడ్డి తెలిపారు. కేవలం ఒక్క కేసులోనే బెయిల్ రావాల్సి ఉందని.. ఈలోపే తండ్రీ కొడుకులను అరెస్టు చేశారని వివరించారు. దాదాపు అన్నీ బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నవేనని అన్నారు. లోగడ వచ్చిన బెయిల్ పేపర్లతో మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తనయుడు పవన్‌రెడ్డి స్టేషన్‌కు చేరుకుని వివరించినప్పటికీ ఫలితం లేకపోయిందని తెలిపారు.
అనంతపురంలో ఉద్రిక్తత...
జేసీ ప్రభాకర్‌రెడ్డి అరెస్టు గురించి తెలుసుకున్న అభిమానులు అనంతపురం సహా జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేశారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి అరెస్టుతో అనంతపురంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లక్ష్మీనగర్‌లో మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఇంటి వద్ద పోలీసులు పెద్దఎత్తున మొహరించారు. కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చేపట్టే అవకాశముందుని భావించిన పోలీసులు.. ముందుజాగ్రత్తగా నగరంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే తాడిపత్రి నుంచి అనంతపురానికి తరలివస్తున్న అనుచరులను బుక్కరాయసముద్రం పోలీసులు అడ్డుకున్నారు. కేవలం మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వాహనాన్ని మాత్రమే అనుమతించారు.
సీఎంకు ఎదురుతిరిగితే అరెస్టులే..: జేసీ
ముఖ్యమంత్రి జగన్‌కు ఎవరు ఎదురు తిరిగినా అరెస్టులే ఉంటాయని మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. టీవీల ద్వారానే సోదరుని అరెస్టు తెలిసిందని, ఎన్వోసీ ఇచ్చిన తరువాత వాహనాలు నడుపుకునే వాళ్లది తప్పు ఎలా అవుతుందో తనకు అర్థం కాలేదని జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. సోదరుని ఆరోగ్య స్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు.
జేసీ పవన్, దీపక్‌రెడ్డిలకు తెదేపా అధినేత చంద్రబాబు ఫోన్ చేశారు. అధైర్యపడొద్దని, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇది రాజకీయ కుట్రేనని, కల్పితపత్రాలు, తప్పుడు సాక్ష్యాలతో నోటీసులు ఇవ్వకుండా అక్రమ అరెస్టు చేశారని చంద్రబాబు చెప్పారు. వైద్యపరీక్షల నివేదికలు వచ్చిన అనంతరం.. ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిని భారీ బందోబస్తు మధ్య న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. విచారణ జరిపిన న్యాయమూర్తి... 14 రోజులు రిమాండ్‌కు ఆదేశించారు.
ఇవీ చదవండి:
తెదేపా నేతల అరెస్టులపై నిరసనలు తీవ్రతరం