Former MLA Prabhakar Chowdhary: అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి సంచలన కామెంట్స్ చేశారు. ఇవాళ చంద్రబాబు, పవన్ కలయిక నేపథ్యంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పొత్తులో భాగంగా పవన్ కల్యాణ్ అనంతపురంలో వచ్చి పోటీ చేస్తే తాను దగ్గరుండి గెలిపిస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే అనంతపురం నుంచి పోటీ చేయాలని భావిస్తున్న ప్రభాకర్ చౌదరి.. తాజాగా ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పవన్ కల్యాణ్ కోసం తన సీటును త్యాగం చేయడమే కాకుండా.. తన భుజస్కందాల మీద మోసి ఆయన్ని గెలిపిస్తానన్నారు.
వైసీపీ ఓటమి, జగన్ ఇంటికి పోవడమే మా రెండు పార్టీల లక్ష్యమని.. ఇందులో భాగంగా పొత్తు కుదిరితే తన సీటు త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలో ఎన్నికలకు తన వ్యూహం వేరే ఉందని పవన్ గతంలో చెప్పారని.. ఇవాళ చంద్రబాబుతో కలయిక అందులో భాగమై ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు ఆదేశాల మేరకు తాము పని చేస్తామని.. ఆయన ఎవర్ని సూచించినా వారి గెలుపు కోసమే పని చేస్తామన్నారు. మరోవైపు ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి తన మీద చేసిన వ్యాఖ్యల మీద ప్రభాకర్ చౌదరి మరోసారి తీవ్రంగా స్పందించారు.