రాష్ట్రంలో కరోనా వ్యాప్తి విస్తృతంగా పెరగటానికి అధికార పార్టీ నాయకుల వైఖరే కారణమని అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అన్నారు. కరోనా లాంటి విపత్కర సమయంలో రాజకీయాలు చేస్తూ... బాధ్యత మరచి ప్రవరిస్తున్నారని ఆయన ఆగ్రహించారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగం నయం చేయాల్సిన వైద్య సిబ్బంది వైరస్ బారిన పడే పరిస్థితి వచ్చిందంటే ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉందో అర్థమవుతుంది అన్నారు.
లాక్డౌన్ సమయంలో ప్రజలకు, వలస కూలీలకు అండగా నిలవాల్సిన అధికార పార్టీ నాయకులు తమ అధికారాన్ని రాష్ట్రంలో ఎక్కడైనా తిరిగేందుకు పాస్పోర్టు లాగా ఉపయోగించుకుంటున్నారని మండిపడ్డారు. తెదేపా నేతలు స్లీపర్ సెల్స్లా మారుతున్నారంటూ మంత్రి మోపిదేవి చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి... వైకాపా నేతల వ్యాఖ్యలను కట్టడి చేసి ప్రజారోగ్యంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.