Farmers Agitation on NH 42 : రాష్ట్రంలో అకాల వర్షాలు, కరవు, వాతావరణ మార్పులు వంటి కారణాల వల్ల పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించడంలో అనేక అవకతవకలు వెలుగు చూస్తున్నాయి. ఉచిత పంటల బీమా పేరుతో నిలువునా ముంచేశారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివిధ పంటలు సాగు చేసిన రైతులకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం భారీగా నష్టపోయినా.. బీమా పరిహారంలో మొండిచేయి చూపింది. రైతుకు రూపాయి ఖర్చు లేకుండా ఉచిత పంటల బీమా కల్పిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి జగన్.. ఆచరణలో మడమతిప్పేశారు.
చేతులు దులుపేసుకున్న ప్రభుత్వం : నష్టపోయిన అన్ని పంటల బీమాను వర్తింపజేయాలని అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం చిన్నమూష్టరులో రైతులు రోడ్డు ఎక్కారు. రైతులు అనంతపురం-బళ్లారి 42వ జాతీయ రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని నినాదించారు. 2022 సంవత్సరంలో అధిక వర్షాలు, విఫరీతమైన ఉష్ణోగ్రత ప్రభావం వల్ల అన్ని పంటలకు నష్టం వాటిల్లిందని, ఏ పంటలను రైతులకు దిగుబడి వచ్చింది లేదన్నారు. ఈ క్రమంలో అన్ని పంటల నష్టాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకుండా మొక్కుబడిగా మండలానికి ఒకటి, రెండు పంటలకు భీమాను వర్తింపజేసి చేతులు దులుపుకొందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం సభను అడ్డుకుంటాం :సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి రైతులపై చిత్తశుద్ధి ఉంటే నష్టపోయిన అన్ని పంటలకు భీమాను వర్తింపజేసి తన చిత్తశుద్ధిని నిరుపించుకోవాలని డిమాండ్ చేశారు. టమోటా పంటలో ఎకరాకు లక్ష రూపాయల వరకు నష్టం వస్తే.. ప్రభుత్వం ఎకరాకు 172 రూపాయలు బీమా కల్పించడం సిగ్గు చేటని వారు అన్నారు.మిగతా పంటలకు సంబంధించిన భీమా కూడా అరకొర గానే ఉందన్నారు. అన్ని పంటలకు బీమా వర్తింప చేయాలని, అలా చేయకపోతే ఈ నెల 8న కళ్యాణ దుర్గం సీఎం సభను అడ్డుకుంటామని రైతులు ప్రకటించారు.