కారు దొంగతనం కేసును ఛేదించారు అనంతపురం జిల్లా ధర్మవరం పోలీసులు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు... వారి నుంచి కారును స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను ధర్మవరం డీఎస్పీ రమాకాంత్ వెల్లడించారు.
ధర్మవరానికి చెందిన దుర్గాప్రసాద్ వద్ద కొర్రపాటి మునీంద్ర కారు డ్రైవర్గా పని చేస్తుండేవాడు. అయితే పనితీరు నచ్చలేదని మునీంద్రను పని నుంచి తొలగించాడు దుర్గాప్రసాద్. దీనివల్ల యజమానిపై కక్ష పెంచుకున్న మునీంద్ర.. ఈ నెల 21న మారు తాళంతో తాను డ్రైవర్గా పనిచేసిన కారునే చోరీ చేశాడు. విచారణలో భాగంగా పోలీసులు అతన్ని ప్రశ్నించగా తాను చోరీ చేయలేదని చెప్పాడు. బుధవారం వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులు... ధర్మవరం మండలంలోని ఉప్పనేసినపల్లి వద్ద కారును గుర్తించారు. బెంగళూరులో కారును విక్రయించేందుకు తీసుకువెళ్తున్నట్లు పోలీసుల విచారణలో మునీంద్ర వెల్లడించాడు. అతనికి సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి ధర్మవరం కోర్టులో హాజరుపరచగా... వారికి కోర్టు రిమాండ్ విధించింది.