అనంతపురంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ఆక్సిజన్ పడకల సంఖ్యను తగ్గిస్తున్నారు. సర్వజనాసుపత్రి, సూపర్ స్పెషాలిటీ, క్యాన్సర్ ఆసుపత్రుల్లో 170 నుంచి 200 దాకా బెడ్లు తగ్గించాలని నిర్ణయించారు. తదనుగుణంగా సర్వజనాసుపత్రిలో మంగళవారం, బుధవారం 40 చొప్పున పడకలు... ఆక్సిజన్ నుంచి సాధారణ పడకలుగా మారాయి.
ఆసుపత్రుల్లో ప్రాణవాయువు ట్యాంకుల సామర్థ్యం తక్కువగా ఉందని బెడ్ల సంఖ్య తగ్గిస్తున్నట్టు తెలుస్తోంది. ఆక్సిజన్ అందక ఇటీవల సర్వజనాసుపత్రిలో 8 మంది, క్యాన్సర్ ఆసుపత్రిలో ఐదుగురు కన్నుమూశారు. వరుస దుర్ఘటనల నేపథ్యంలో మంగళవారం సమావేశమైన అధికారులు... ఆక్సిజన్ పడకల సంఖ్య తగ్గింపే పరిష్కారమని తేల్చారు.
అనంతపురం సర్వజనాసుపత్రిలో 615 పడకలుండగా... అందులో 311 ఆక్సిజన్, 54 వెంటిలేటర్, 250 సాధారణమైనవి. వెంటిలేటర్ పడకలను అలాగే ఉంచి ఆక్సిజన్ బెడ్ల సంఖ్య తగ్గిస్తున్నారు. నగరంలోని 3 ఆసుపత్రుల్లో 32.5 కే.ఎల్. సామర్థ్యంతో ఆక్సిజన్ ట్యాంకులు ఉన్నాయి.