అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడుపై ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ.. బీఎస్పీ నాయకులు ర్యాలీ చేపట్టారు. పట్టణంలోని అంబేడ్కర్ కూడలి నుంచి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఆర్డీవో కార్యాలయానికి ర్యాలీగా వెళ్తున్న బీఎస్పీ నాయకులను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. రాష్ట్ర అధ్యక్షుడుతో పాటు బీఎస్పీ నాయకులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బహుజనులంతా ఏకమై వచ్చే ఎన్నికల్లో ధర్మవరం ఎమ్మెల్యేకు తగిన బుద్ధి చెబుతామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు సంపద రావు హెచ్చరించారు.
'క్షమాపణ చెప్పాలి.. లేనిపక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తాం'
జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ధర్మవరం ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి క్షమాపణ చెప్పాలని ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. అనంతపురంలోని ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించిన నాయకులు.. నిబద్ధతతో పని చేస్తున్న కలెక్టర్‌పై లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదని హెచ్చరించారు.
ఈ ప్రభుత్వం దళితులను మొదటినుంచి తక్కువస్థాయిలో చూస్తూ చట్టవిరుద్ధ కార్యక్రమాలకు పాల్పడుతున్నారని నాయకులు విమర్శించారు. ధర్మవరం ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పాలని.. లేనిపక్షంలో ఆందోళన తీవ్రతరం చేయడానికి వెనకాడబోమని స్పష్టం చేశారు.