అనంతపురం జిల్లా అంటేనే తీవ్ర కరవు ప్రాంతం. ఇక్కడి పల్లెల్లోనే కాదు.. పట్టణాల్లోనూ నీటి కటకట కనిపిస్తూనే ఉంటుంది. నీటి సంరక్షణ చర్యలు అంతంతమాత్రంగానే ఉండటంతో భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గుంతకల్లు పట్టణానికి చెందిన సత్యనారాయణ, జ్యోతి దంపతులు నలుగురికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఇంకుడుగుంత ఉండగా...చింత ఎందుకు దండగ - home
అభివృద్ధి పేరుతో నగరాలన్నీ కాంక్రీట్ వనాలుగా మారుతున్న రోజులివి. కొంత డబ్బు సంపాదించాక అందరి కల సొంతింటిపైనే. అయితే రోజురోజుకూ క్షీణిస్తున్న నీటి వనరుల సంరక్షణకు ఎవరైనా చర్యలు తీసుకుంటున్నారా అంటే.. ఎక్కువగా లేదనే సమాధానం వినిపిస్తుంది. అయితే ఇల్లు కట్టుకున్నప్పుడే ప్రతి నీటిబొట్టునూ ఒడిసిపట్టేలా ఇంకుడుగుంతను నిర్మించి చుట్టుపక్కల వారికి ఆదర్శంగా నిలుస్తోంది ఓ జంట.
టీచర్స్ కాలనీలో ఇల్లు కట్టుకున్న వీళ్లు.. నిర్మాణం సమయంలోనే ఇంకుడుగుంత ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇంజినీరును సంప్రదించి ఇంటి ప్లాన్‌లోనే ఇంకుడుగుంతను చేర్చారు. వర్షపు నీరే కాకుండా... ఇంట్లో పాత్రలు కడిగిన, దుస్తులు ఉతికిన నీరు కూడా ఈ గుంతలోకి వెళ్లేలా పైప్‌లైన్లు ఏర్పాటు చేసుకున్నారు. ముందుచూపుతో ఇలాంటి చర్యలు చేపడితే నీటి కష్టాల నుంచి గట్టెక్కవచ్చని చెబుతున్నారు.
ఇంటి నిర్మాణ సమయంలో ఇంకుడుగుంత ఏర్పాటుకు కొంత ఖర్చైనా దానికి వెనుకాడకుండా ఉండటంతోనే ప్రస్తుతం ఈ దంపతులు స్థానికుల నుంచి అభినందనలు పొందుతున్నారు. వీరిని ఆదర్శంగా తీసుకున్న మరికొందరు కాలనీవాసులు ఇంకుడుగుంతల నిర్మాణం దిశగా అడుగులేస్తున్నారు.