సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అనంతపురం జిల్లాలో ఎన్నికల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా 14 నియోజకవర్గాల్లో 26 లక్షల 54 వేల 257 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతపురం లోక్ సభ స్థానం పరిధిలో 13 లక్షల 34 వేల 150 ఓట్లు పోల్ కాగా, హిందూపురం లోక్ సభ స్థానం పరిధిలో 13 లక్షల 20 వేల 107 మంది ఓటు వేశారు. ఓట్ల లెక్కింపు కోసం జేఎన్టీయూ, శ్రీకృష్ణ దేవారాయ విశ్వవిద్యాలయ కళాశాలల్లో ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధికంగా రాయదుర్గం అసెంబ్లీ స్థానానికి 23 రౌండ్లు, అత్యల్పంగా పుట్టపర్తి నియోజకవర్గం ఓట్లను 18 రౌండ్లతో ఓట్లు లెక్కించనున్నారు. ఓట్ల లెక్కింపులో తొలుత పుట్టపర్తి, చివరగా రాయదుర్గం నియోజకవర్గాల ఫలితాలు రానున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి వీరపాండియన్ చెప్పారు.
ఓట్ల లెక్కింపు కోసం జిల్లాలోని 50 శాతం పోలీసులను రెండు సెంటర్ల వద్ద వినియోగిస్తున్నారు. కేంద్ర బలగాల నుంచి పది కంపెనీలకు చెందిన పోలీసుల ఓట్ల లెక్కింపు వద్ద భద్రతగా ఉంటారు. కౌంటింగ్ కేంద్రాల ప్రహరీ ప్రధాన ద్వారం వద్ద స్థానిక పోలీసులు భద్రత పర్యవేక్షిస్తారు. ఎన్నికల ఫలితాల అనంతరం జిల్లాలో ఘర్షణలు చోటుచేసుకునే అవకాశం ఉన్న 75 గ్రామాల్లో భద్రతను కట్టుదిట్టంచేశారు. అత్యంత సమస్యాత్మక గ్రామాల్లో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. భద్రతకు సంబంధించి అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు డీఐజీ కాంతి రాణా టాటా, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ చెప్పారు.