CM Jagan Careless on YSR Aasara Scheme :ఆసరా పథకం అమలు గురించి గొప్పలు చెప్పే రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన బాలింతలకు లబ్ధి అందించడంలో మాత్రం విఫలమవుతోంది. ప్రభుత్వాసుపత్రుల్లో జరిగే ప్రసవాలకు తగ్గట్లు ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసే సిబ్బంది లేకపోవడంతో పాటు వైద్యులు, అధికారులు పట్టించుకోకపోవడంతో బాలింతలకు ఆసరా అందడం లేదు. ఆసుపత్రుల్లో శిశువులకు జన్మనిచ్చి, డిశ్చార్జ్ అయ్యేటప్పుడు బాలింతల బ్యాంకు ఖాతాల్లో ఆరోగ్యశ్రీ ట్రస్టు (Arogyasree Trust) ద్వారా 5వేల రూపాయలు జమ చేయాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సంలో ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య లక్షా 85వేల 581 ప్రసవాలు జరిగాయి. ఇందులో లక్షా 33 వేల మందికి పైగా తల్లులు అంటే 71.67శాతం మందికే ఆసరా కింద లబ్ధి అందించారు.
YSRCP Government Did not Give Money to Maternity Women :ఏప్రిల్ నుంచి నవంబరు మధ్య ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 21వేల 725 ప్రసవాలు జరిగితే కేవలం 19.97 శాతం మంది బాలింతలకు మాత్రమే సాయం అందింది. నెల్లూరు జిల్లాలో 0.094 శాతం, అనంతపురం 2.05శాతం, పార్వతీపురం 2.08శాతం, విజయనగరం జిల్లాలో 4.25శాతం మంది బాలింతలకే ఆసరా అందింది. నెల్లూరు జిల్లా పీహెచ్‌సీల్లో 320 ప్రసవాలు జరిగితే ముగ్గురికి, అల్లూరి జిల్లాలో 4వేల 397 ప్రసవాలు జరిగితే 197 మందికి మాత్రమే సాయం అందించారంటే పథకం ఎంత మొక్కుబడిగా అమలు చేస్తున్నారో అర్థమవుతుంది.
ఆసరా పథకం కింద లబ్ధి చేకూర్చాలంటూ మహిళల ఆందోళన
YSR Aasara Scheme For Maternity Women in AP :వైద్యవిధాన పరిషత్ ఆసుపత్రుల్లో 95 వేల 85 ప్రసవాలు జరిగితే 74 వేల 481 మంది బాలింతల ఖాతాల్లో ఆసరా సాయం జమైంది. మరో 20వేల 604 మందికి ఇప్పటికీ సాయం అందలేదు. కడప, శ్రీసత్యసాయి, చిత్తూరు, తిరుపతి, బాపట్ల, పల్నాడు, అనకాపల్లి, నెల్లూరు, అల్లూరి జిల్లాల్లో ఆర్థిక సాయం పొందిన వారు 70 శాతం లోపే ఉన్నారు. వైద్యవిద్య సంచాలకుల పరిధిలో పనిచేసే ఆసుపత్రుల్లో 68వేల 771 ప్రసవాలు జరిగితే 54 వేల 181 మంది బాలింతలకే ఆసరా అందింది. నెల్లూరు, ఎన్టీఆర్, శ్రీకాకుళం జిల్లాల్లో చాలామందికి మొండిచేయి చూపారు.