అనంతపురం జిల్లాలో చలి తీవ్రత పెరుగుతుండటంతో రైతులు సాగు పద్ధతుల్లో ఆధునిక మార్గాలను ఎంచుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా మూడు వేల హెక్టార్లలో అన్ని రకాల పూలతోటలు సాగుచేస్తుండగా, దీనిలో 600 ఎకరాల్లో చామంతి పంట వేస్తున్నారు. చలి కాలంలో పగటి సమయం తగ్గిపోతుండటంతో చామంతి పూల సాగుకు విద్యుత్ దీపాలతో కృత్తిమ వెలుగులు ఏర్పాటు చేస్తున్నారు. చామంతి పూలు సకాలంలో విరబూయాలన్నా ఎక్కువ దిగుబడి రావాలన్నా వెలుతురు ఎంతో అవసరం. శీతాకాలం కావడంతో ముందుగానే చీకటిపడిపోతోంది. ఈ ప్రభావం పంట దిగుబడిపై పడుతుందని గ్రహించిన రైతులు చామంతి తోటలకు కృత్రిమ వెలుగులు అందిస్తున్నారు. దీంతో మొక్కలు ఏపుగా పెరిగి త్వరగా మొగ్గతొడిగి సమయానికి పూల దిగుబడి వస్తుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఏటా శివరాత్రి సమయానికి చామంతి పూలకు మార్కెట్లో మంచి ధరలు ఉంటాయి. దీంతో రైతులు మందస్తు ప్రణాళికతో డిసెంబర్ నుంచే ఈ పంటను సాగుచేస్తున్నారు. కోల్కతా నుంచి మొక్కలు తెప్పించుకుని, డ్రిప్ పద్ధతిలో సాగుచేస్తున్నారు. సకాలంలో దిగుబడి రావడం కోసం మొక్క నాటిన నెల రోజుల తరువాత నుంచి రాత్రివేళలో దీపాలు అమర్చి కృత్రిమ వెలుగులు ఏర్పాటు చేస్తున్నామని రైతులంటున్నారు. ఇందుకోసం విద్యుత్ శాఖ నుంచి సింగల్ ఫేస్ కనెక్షన్ తీసుకొని అదనంగా విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నారు. కొంత వరకు ఎక్కువ ఖర్చు చేయాల్సివచ్చినా దానికి సరిపడా ఆదాయం కూడా వస్తుందని రైతులంటున్నారు.