Chandrababu Naidu Fire On CM Jagan :బీసీలపై సీఎం జగన్ మోహన్ రెడ్డిది కపట ప్రేమ అని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో "బాబు షూరిటీ - భవిష్యత్తుకు గ్యారంటీ" కార్యక్రమంలో పాల్గొన్న ఆయన..నాలుగు సంవత్సరాలల్లో 26 వేల మందిపై అక్రమ కేసులు పెట్టించారని మండిపడ్డారు. రిజర్వేషన్లూ 24 శాతం తగ్గించి ద్రోహం చేశారని ఆక్షేపించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని వర్గాలకు న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు.
Babu Surety Future Guarantee Program in Anantapuram District:మాట్లాడితే నా బీసీలు అంటూ ఊదరగొట్టే సీఎం జగన్.. ఆ వర్గాలకు చేసిందేమీ లేదని చంద్రబాబు నాయుడు విమర్శించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబు.. వైసీపీ పాలనలో బీసీలకు ఒరిగిందేమీ లేదన్నారు. రిజర్వేషన్ల నుంచి అన్నింటిలోనూ వారికి అన్యాయం చేశారని ఆరోపించారు. అక్రమ కేసులతో వారిని వేధించారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకువస్తానని ఆయన హామీ ఇచ్చారు.
రైతులను ప్రభుత్వ పట్టించుకుందా? : తాము అధికారంలోకి వస్తే పాత పథకాలన్ని పునరుద్ధరిస్తామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ సంవత్సరం వర్షాభావంతో పంటలు పూర్తిగా ఎండిపోయాయని, ప్రభుత్వం ఒక్క రూపాయి అయినా సాయం చేసిందా అని ప్రశ్నించారు. పంట నష్ట పరిహారం, పంటల బీమా, రాయితీ సూక్ష్మ బిందు సేద్య పరికరాలు, బీసీలకు ఆదరణ పరికరాలు, దళితులకు సంబంధించిన పథకాలను అమలు చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు.
చదువు చెప్పే గురువుల స్థాయిని దిగజార్చేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించారని చంద్రబాబు మండిపడ్డారు. గురువుల కంటే గూగుల్ గొప్పదని చెప్పడం వారి అహంకారానికి నిదర్శనమని ఆక్షేపించారు. చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో తమకు ఉద్యోగాలు లేవని యువత ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో పెద్ద కంపెనీలు రాష్ట్రానికి వస్తే.. జగన్ మాత్రం యువతను మత్తులో ముంచే కంపెనీలు తెచ్చారని ఆయన ఎద్దేవా చేశారు.