ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

NREGS Bills: నాలుగు వారాల్లోగా ఉపాధి పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి: హైకోర్టు - ఏపీలో ఉపాధి బిల్లులు

NREGS pending bills
NREGS pending bills

By

Published : Oct 5, 2021, 2:42 PM IST

Updated : Oct 6, 2021, 5:47 AM IST

14:36 October 05

NREGS pending bills

గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఉపాధి హామీ, ఇతర పనుల బకాయిలను తక్షణం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. 12% వడ్డీని నాలుగు వారాల్లో చెల్లించాలంటూ కీలక తీర్పు ఇచ్చింది. ఇప్పటికే కొంత బకాయిలు పొందిన వారికి మిగిలిన సొమ్మును వెంటనే చెల్లించాలని స్పష్టం చేసింది. ఉపాధి పనులపై విజిలెన్స్‌ విచారణ పేరుతో 21% నిధుల్ని పట్టి ఉంచేందుకు (విత్‌హోల్డ్‌) వీలుకల్పిస్తూ పంచాయతీరాజ్‌శాఖ గతేడాది నవంబర్‌, ఈ ఏడాది మేలో జారీచేసిన రెండు మెమోలను రద్దు చేసింది. బిల్లులు చెల్లించకపోవడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. ‘పిటిషనర్లకు బకాయిలు చెల్లించకుండా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం చట్టవిరుద్ధంగా అనుభవిస్తోంది. పిటిషనర్లు ఉపాధి పనులు చేశారు, కేంద్ర ప్రభుత్వం వాటాగా 75% నిధుల్ని విడుదల చేసింది. బిల్లులు మాత్రం చెల్లించలేదు. పిటిషనర్లు తమకు జరిగిన నష్టానికి వడ్డీ పొందేందుకు అర్హులు. బకాయిల చెల్లింపుల్లో జాప్యానికి పరిహారం మంజూరు చేసేలా ఉపాధిహామీ చట్టంలో నిబంధనలను చేర్చేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నాం’ అని పేర్కొంది. 1012 వ్యాజ్యాల్లో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ మంగళవారం ఈ మేరకు తీర్పు ఇచ్చారు.

‘గుత్తేదారులకు చెల్లింపు నిమిత్తం ప్రభుత్వం ఇప్పటికే పంచాయతీలకు జమచేసిన సొమ్మును విడుదల చేయకపోతే తీవ్రంగా పరిగణిస్తాం. అలాంటి ఘటనలను కోర్టు దృష్టికి తీసుకొస్తే బాధ్యులపై, పంచాయతీలపై చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు.

నేపథ్యం ఇదే..

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద 2017, 2018, 2019 సంవత్సరాల్లో చేపట్టిన పనులు, ముఖ్యంగా మౌలిక వసతుల కల్పన కోసం నిర్మాణ సామగ్రి నిమిత్తం చేసిన ఖర్చుల బకాయిలు చెల్లించకపోవడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో వెయ్యికి పైగా వ్యాజ్యాలు దాఖలయ్యాయి. గతంలో న్యాయస్థానం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం.. కొందరు పిటిషనర్లకు 79% బకాయిలు చెల్లించింది. విజిలెన్స్‌ విచారణ పేరుతో 21% ఆపింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. ఉపాధి పనులకు విజిలెన్స్‌ విచారణ పేరుచెప్పి బిల్లులు నిలిపేయడం సరికాదన్నారు. కేంద్రం తన వాటా విడుదల చేసినా, రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకుండా పిటిషనర్లను ఇబ్బంది పెడుతోందన్నారు. పంచాయతీరాజ్‌శాఖ ప్రభుత్వ న్యాయవాది (జీపీ) వాదనలు వినిపిస్తూ.. కేంద్రం నుంచి బకాయిల సొమ్ము రావాల్సి ఉందన్నారు. విజిలెన్స్‌ విచారణ పెండింగ్‌లో ఉండటంతో పిటిషనర్లకు బిల్లులు చెల్లించలేదన్నారు. వ్యాజ్యాలకు విచారణ అర్హత లేదన్నారు.

తీర్పులో ఏముందంటే

‘కేంద్రం తన వాటా సొమ్మును క్రమం తప్పక చెల్లిస్తోంది. విజిలెన్స్‌ విచారణ పూర్తయినట్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమాచారం ఇచ్చింది. ఆ విషయాన్ని కేంద్రం కోర్టుకు తెలిపింది. మరోవైపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) హైకోర్టుకు హాజరై.. విచారణ పెండింగ్‌లో లేదన్నారు. వివరాలు పరిశీలిస్తే.. పంచాయతీరాజ్‌శాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్‌.. విజిలెన్స్‌ విచారణ పూర్తయినా కాలేదనడం, కేంద్రం నుంచి బకాయిలు రావాల్సి ఉందని చెప్పడం కోర్టును తప్పుదోవ పట్టించడమే. బకాయిల చెల్లింపులను ఆలస్యం చేయడానికే అలా తెలిపారు. చట్టబద్ధంగా సొమ్మును పొందేందుకు పిటిషనర్లు అర్హులు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రాక పిటిషనర్లు ఉద్యోగులు, కార్మికులకు జీతాలు ఇవ్వలేక ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి పనులపై అత్యల్పంగా విజిలెన్స్‌ విచారణ చేసి మొత్తం పనులకు 21% సొమ్ము బకాయిలను ఆపడం సహేతుకం కాదు. అక్రమాల ఆరోపణలపై పిటిషనర్ల వివరణ తీసుకోకుండా సొమ్ము నిలుపుదల సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం’ అని తీర్పులో పేర్కొన్నారు.

ఇదీ చదవండి

swecha program: బాలికల ఆరోగ్యం, పరిశుభ్రతే 'స్వేచ్ఛ' లక్ష్యం: సీఎం జగన్​

Last Updated : Oct 6, 2021, 5:47 AM IST

ABOUT THE AUTHOR

...view details