అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీకి కంచుకోట. కాకలు తీరిన నేతలు, సుదీర్ఘ రాజకీయ నేపథ్యమున్న కుటుంబాలు పోటీ పడినా... తెదేపానే ఆధిక్యం సాధిస్తూ వచ్చింది. జిల్లాలో 14అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంటు నియోజకవర్గాలున్నాయి. 32లక్షల 39వేల మంది ఓటర్లుండగా... 26లక్షల 54వేల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2014 ఎన్నికల్లో 80.04 శాతం ఓట్లు పోల్ కాగా... ఈసారి 82.22 శాతం నమోదైంది.
అనంతపురం జిల్లాలో 2009 ఎన్నికల వరకు కాంగ్రెస్ ఆధిపత్యం ఉండేది. కానీ 2014 ఎన్నికల్లో తెదేపా పుంజుకొని 12 అసెంబ్లీ, రెండు పార్లమెంటు స్థానాలను కైవశం చేసుకుంది. వైకాపా గెలిచిన 2స్థానాల్లో ఒకటి కదిరి, మరొకటి ఉరవకొండ. అప్పుడు కదిరిలో తెదేపా అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ అతి నమ్మకంతో నిర్లక్ష్యం చేశారని చంద్రబాబు ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లోనూ కందికుంట మరోసారి కదిరి నుంచి పోటీలో నిలిచారు. కందికుంట వైకాపా అభ్యర్థి డా.సిద్దారెడ్డిల మధ్య హోరాహోరీ పోటీ సాగిందనే చెప్పవచ్చు. కదిరిలో ముస్లిం మైనార్టీ ఓటర్లు ఏ పార్టీవైపు మొగ్గు చూపుతారో కదిరి వారినే వరించనుంది.
జిల్లాలో మరో కీలక స్థానం రాప్తాడు. పరిటాల కుటుంబానికి తిరుగులేని నియోజకవర్గం. కానీ ఈ ఎన్నికల్లో హోరాహోరీ పోరు కొనసాగింది. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు అధికంగా ఉండే రాప్తాడులో ఇప్పటి వరకు పరిటాల అభ్యర్థినే గెలిపిస్తూ వచ్చారు. వైకాపా అభ్యర్థిగా తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి గట్టి పోటీ ఇచ్చారు. 82.32 శాతం పోలింగ్ నమోదవగా... ఎవరు గెలిచినా మెజారిటీ మాత్రం 5వేల లోపే ఉంటుందనే అంచనా. మరో కీలక నియోజకవర్గం తాడిపత్రి. ఇక్కడ ఇప్పటి వరకు జేసీ సోదరులకు ఓటమి తెలియదు. ఇప్పుడు జేసీ వారసుడు అస్మిత్ రెడ్డి తెదేపా అభ్యర్థిగా పోటీ చేశారు. వైకాపా నుంచి కేతిరెడ్డి పెద్దారెడ్డి బరిలో నిలిచారు. వీరిద్దరి మధ్య గట్టి పోరు సాగినప్పటికీ... ఓటర్లు ఎవరివైపు మొగ్గు చూపారనేది తేలనుంది.
హిందూపురం తెదేపాకు కుంచుకోట. పార్టీ ఆవిర్భావం నుంచి ఓటమి ఎరగని స్థానం ఇది. 1983 నుంచి తెదేపా అభ్యర్ధినే హిందూపురం ఓటర్లు గెలిపిస్తూ వచ్చారు. నందమూరి బాలకృష్ణ మరోసారి తెదేపా అభ్యర్థిగా బరిలో నిలిచారు. మైనార్టీ ఓటర్లు 40 వేల మంది వరకు ఉన్న హిందూపురంలో... ఈసారి వైకాపా మైనార్టీ నేతనే బరిలో నిలిపింది. విశ్రాంత పోలీస్ అధికారి మహమ్మద్ ఇక్బాల్ వైకాపా నుంచి పోటీ చేశారు. ఇప్పటి వరకు తెదేపాకు ఎదురులేని హిందూపురంలో ఈసారి ఓటర్లు ఏ పార్టీ అభ్యర్థిని ఆశీర్వదిస్తారో ఓట్ల లెక్కింపుతో తేలనుంది.
శింగనమల అసెంబ్లీ స్థానంలో తెదేపా బండారు శ్రావణిని బరిలో నిలిపింది. గత ఎన్నికల్లో ఓటమిపాలైన వైకాపా అభ్యర్థి జొన్నలగడ్డ పద్మావతి ఈసారి శ్రావణితో పోటీ పడ్డారు. ఇద్దరి మధ్య పోరు హోరాహోరీగా సాగగా, జేసీ సోదరులు శ్రావణి గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎన్నికల్లో పనిచేశారు. కళ్యాణదుర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరిని కాదని, ఉమామహేశ్వరనాయుడుకు తెదేపా టికెట్ ఇచ్చారు. పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచారు. వైకాపా అభ్యర్థి ఉషశ్రీ, తెదేపా అభ్యర్థి ఉమామహేశ్వర నాయుడుల మధ్య గట్టి పోటీ నెలకొనగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘువీరాపై ప్రజల్లో కొంతమేర ఉన్న సానుభూతి కారణంగా ఓట్లను చీల్చినట్లు తెలుస్తోంది.