ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనంతలో సైకిల్ స్పీడుకు ఫ్యాను తట్టుకుంటుందా..!? - janasena

రాయలసీమలో మిగిలిన జిల్లాలతో భిన్నమైన రాజకీయ తీర్పునిచ్చేది అనంతపురం. కొన్ని దఫాలుగా మిగిలన సీమ జిల్లాలు ... కాంగ్రెస్, వైకాపాకు జై కొడితే.. అనంతపురం మాత్రం తెలుగుదేశాన్ని ఆదరిస్తూ వచ్చింది. 2014లో హోరాహోరీ ఎన్నికల్లోనూ.. అనంతపురంలోని 14 స్థానాల్లో 12చోట్ల తెదేపా జెండానే రెపరెపలాడింది. ఈ సారి ప్రత్యేక సామాజిక వ్యూహంతో వైకాపా బరిలోకి దిగుతోంది. తెదాపా తాకిడిని తట్టుకోగలదా మరి..!?

anantapur district political review

By

Published : Apr 9, 2019, 4:50 PM IST

అనంతలో సైకిల్ స్పీడుకు ఫ్యాను తట్టుకుంటుందా

అనంతపురం జిల్లాలో రాజకీయం ఎప్పుడూ రంజుగానే ఉంటుంది. 2011కు పూర్వం ఈ జిల్లాలో తెదేపా-కాంగ్రెస్ పార్టీల మధ్య నువ్వానేనా అన్నట్లు పోరు ఉండగా... జగన్​ సొంత పార్టీ పెట్టినప్పటి నుంచి పోటీ వైకాపా, తెదేపా మధ్య సాగుతోంది. కిందటి ఎన్నికల్లో తెదేపాకు రాయలసీమలో ఎదురుగాలి వీచినా.. అనంతలో మాత్రం సైకిల్ దూసుకుపోయింది. అనంతపురంలో తెదేపాను ఎదుర్కోవడానికి వైకాపా బీసీ వ్యూహంతో ముందుకొచ్చింది. ఎంపీ సీట్లను బీసీలకు ఇచ్చి.. రాజకీయం చేస్తోంది. అయితే కరవు సీమ సిగలో కియాను పొదిగిన చంద్రబాబు.. యువతకు ఉపాధి చూపించారు. కరవు నేలకు కృష్ణమ్మను తరలించి రైతుల మనసు గెలిచారు. ముందు కన్నా మరింత బలపడిన తెదేపాను వైకాపా ఎలా తట్టుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. .
ఉరవకొండ...ఎవరికి అండ..?
ఉరవకొండలో తెదేపా, వైకాపా మధ్యే ప్రధాన పోటీ ఉంది. తెదేపా తరఫున బరిలో ఉన్న సీనియర్ నేత పయ్యావుల కేశవ్... ప్రభుత్వం చేసిన అభివృద్ధి, వ్యక్తిగత పరిచయాలే గెలిపిస్తాయని ధీమాతో ఉన్నారు. కొందరికే ప్రాధాన్యమిస్తారన్న విమర్శలున్నాయి. వైకాపా నుంచి వై.విశ్వేశ్వర్​రెడ్డి పోటీ చేస్తున్నారు. సామాజికవర్గం అండ, ప్రభుత్వంపై వ్యతిరేకత కలిసొస్తుందని నమ్ముతుండగా... క్షేత్రస్థాయిలో కార్యకర్తల మధ్య సఖ్యత లేకపోవడం, పయ్యావులపై సానుకూలత ఇబ్బందిగా మారిందనే వాదన వినిపిస్తోంది.
పెనుకొండలో...ఎగిరేది ఏ జెండా..?
పెనుకొండలో తెదేపా తరఫున బి.కె. పార్థసారథి పోటీ చేస్తున్నారు. పార్టీ బలం, అభివృద్ధి, సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని గట్టిగా నమ్ముతున్నారు. పార్టీలోనే కొందరి నేతల సహాయనిరాకరణ, కొన్ని గ్రామాల్లో ప్రత్యర్థి వర్గం బలంగా ఉండటం తలనొప్పిగా మారింది. వైకాపా నుంచి ఎన్​.శంకరనారాయణ బరిలో నిలిచారు. ఓ సామాజికవర్గం అండతో కచ్చితంగా విజయం సాధిస్తారని శ్రేణులు చెబుతుండగా... చాలా గ్రామాల్లో పరిటాల వర్గం బలంగా ఉండటం, పలు ప్రాంతాలపై పట్టు లేకపోవడం ప్రతిబంధకాలుగా మారాయి.
హిందూపురం...హిస్టరీ రిపీటేనా..?
హిందూపురం నుంచి తెదేపా తరఫున నందమూరి బాలకృష్ణ బరిలో ఉన్నారు. ఇది పార్టీకి పట్టున్న ప్రాంతం కావడం... నందమూరి కుటుంబంపై ప్రజలకున్న అభిమానంతో సులభంగా విజయతీరం చెరుతామని తెదేపా గట్టిగా నమ్ముతోంది. అందుబాటులో ఉండకపోవడం, ప్రవర్తనపై విమర్శలు ఉన్నాయి. ఫ్యాను పార్టీ నుంచి ఇక్బాల్ అహ్మద్​ఖాన్ పోటీ చేస్తున్నారు. మైనారిటీ ఓట్లు, కొన్ని వర్గాల్లో జగన్​​పై ఉన్న అభిమానం గెలిపిస్తుందని నమ్ముతున్నారు. బలమైన ప్రత్యర్థి, క్షేత్రస్థాయిలో సరైన సహకారం లేకపోవడం పార్టీలో ఆందోళన కలిగిస్తోంది.
కళ్యాణదుర్గం... ఎవరికి అందలం..?
కళ్యాణదుర్గంలో త్రిముఖపోరు ఉంది. తెదేపా నుంచి ఉమామహేశ్వరనాయుడు పోటీ చేస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి తనను గెలిపిస్తాయని ఉమామహేశ్వరనాయుడు నమ్మకంతో ఉండగా... బలమైన ప్రత్యర్థులు, కొందరు నేతల్లో అసంతృప్తి కలవరపెట్టే విషయాలు. వైకాపా నుంచి కే.వీ ఉషశ్రీ చరణ్ బరిలో ఉన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత, జగన్​పై సానుకూలత కలిసొస్తుందని నమ్ముతున్నారు. కాంగ్రెస్, జనసేన పార్టీలు ఓట్లు చీలుస్తారనే భయం వెంటాడుతోంది. కాంగ్రెస్ తరఫున పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పోటీలో ఉన్నారు. విస్తృత పరిచయాలు, తన అనుభవం గెలిపిస్తుందనే ధీమాతో ఉన్నారు ఆయన. కాంగ్రెస్​పై ప్రజల్లో సహజ వ్యతిరేకత, ప్రత్యర్థులతో పోలిస్తే క్షేత్రస్థాయి కేడర్​ లేకపోవడం ఇబ్బందిగా మారింది.
పుట్టపర్తిపై పట్టు సాధించేదెవరు..?
పుట్టపర్తిలో తెదేపా నుంచి రాష్ట్రమంత్రి పల్లె రఘునాథరెడ్డి పోటీ చేస్తున్నారు. తాను చేసిన అభివృద్ధి పనులు, ప్రజలతో ఉన్న సంబంధాలే గెలిపిస్తాయని నమ్ముతున్న పల్లెకు... కొంతమంది నేతల్లో అసంతృప్తి, అనుచరులపై ఉన్న ఆరోపణలు తలనొప్పిగా మారాయి. వైకాపా తరఫున డి.శ్రీధర్​రెడ్డి బరిలో నిలిచారు. నియోజకవర్గంతో ఉన్న పరిచయాలు, ఆర్థిక బలం గెలిపిస్తుందని శ్రేణులు నమ్ముతున్నారు. బలమైన ప్రత్యర్థి, సొంత సామాజికవర్గంలో ఓట్లు చీలే అవకాశం ప్రతికూలంగా మారింది.
ధర్మవరం...ఎవరికి వరం..?
ఇక్కడ అధికార, ప్రతిపక్షాల మధ్యే పోటీ ఉంది. తెదేపా తరఫున గోనుగుంట్ల సూర్యనారాయణ పోటీ చేస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, తెదేపా చేసిన అభివృద్ధే తమ నేతను గెలిపిస్తాయని కార్యకర్తలు నమ్ముతున్నారు. ఓ సామాజికవర్గంలో వ్యతిరేకత, సొంతపార్టీ నేతల్లో సఖ్యత లేకపోవడం ఇబ్బందిగా మారింది. వైకాపా నుంచి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి బరిలో ఉన్నారు. సామాజికవర్గం అండ, నవరత్నాలు, ఆర్థిక బలంతో విజయం తథ్యమని శ్రేణులు ధీమాతో ఉన్నాయి. కొన్ని వర్గాల్లో జగన్​పై వ్యతిరేకత, పలు గ్రామాల్లో శ్రేణుల మధ్య కలహాలు కలవరపెట్టే అంశం.
అనంతపురం అర్బన్‌...ఆధిక్యం ఎవరిది..?
అనంతపురం అర్బన్​లో హోరాహోరీ పోరు నెలకొంది. తెదేపా అభ్యర్థిగా ప్రభాకర్​చౌదరి బరిలో ఉన్నారు. పార్టీ బలం, ఐదేళ్లలో చేసిన అభివృద్ధే విజయాన్ని అందిస్తుందని తెదేపా బలంగా నమ్ముతోంది. బలమైన ప్రత్యర్థి ఉండటం, జనసేన అభ్యర్థి ఓట్లు చీలుస్తారనే అంశాలు కలవరపెడుతున్నాయి. వైకాపా తరఫున అనంత వెంకట్రామిరెడ్డి పోటీ చేస్తున్నారు. ఆర్థిక బలం, సామాజికవర్గం బలంగా చెప్పవచ్చు. ప్రత్యర్థితో పోలిస్తే ప్రచారంలో వెనుకంజ, కొన్ని సామాజికవర్గాల్లో వ్యతిరేకత సమస్యగా మారింది.
మడకశిరలో సిరి ఎవరికి..
మడకశిరలో తెదేపా నుంచి ఈరన్న బరిలో ఉన్నారు. తెదేపాకున్న సంస్థాగత శ్రేణులు, ప్రభుత్వ కార్యక్రమాలు గెలిపిస్తాయని ధీమాగా ఉన్నారు. ప్రజల్లో సహజ వ్యతిరేకత, ఆశించిన మేర కలుపుకెళ్లే తత్వం లేకపోవడం ప్రతికూలాంశమని కార్యకర్తలు భావిస్తున్నారు. వైకాపా అభ్యర్థిగా ఎం తిప్పేస్వామి పోటీ చేస్తున్నారు. జగన్​ ఇమేజ్​, నవరత్నాలు, నియోజకవర్గంలో మంచి పేరుండటం కలిసొచ్చే అంశాలు. ఆశించిన మేర ప్రచారంలో దూసుకెళ్లకపోవటం, క్షేత్రస్థాయి కార్యకర్తల్లో సఖ్యతలేమి సమస్యగా మారింది.
కదిరి...ఎవరిది..?
కదిరిలో తెదేపా నుంచి కందికుంట వెంకటప్రసాద్ పోటీ చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, తెదేపాకున్న సంస్థాగత బలం గెలిపిస్తాయనే నమ్మకంతో ఉన్నారు ఇక్కడి శ్రేణులు. గతంలో తెదేపాకు పడిన ముస్లింల ఓట్లు చీలడం, కొందరికే ప్రాధాన్యతనిస్తారనే ప్రచారం నష్టం చేయొచ్చనే భావన వ్యక్తమవుతోంది. వైకాపా నుంచి డాక్టర్​ పీవీ సిద్దారెడ్డి బరిలో నిలిచారు. వ్యక్తిగతంగా ఉన్న పేరు, జగన్​పై ప్రజల్లో ఉన్న అభిమానం విజయాన్ని అందిస్తుందని వైకాపా భావిస్తోంది. పార్టీకి అండగా ఉన్న వైకాపా ఓట్లు దూరం కావటం, శ్రేణులు ఆశించినంత ప్రచారంలో దూసుకెళ్లకపోవడం, కొందరి నేతల అసంతృప్తి ఆందోళన కలిగించే అంశం.
రాప్తాడు... పరిటాల స్పీడు
రాప్తాడులో తెదేపా తరఫున పరిటాల వారసుడు శ్రీరామ్​ మొదటిసారి పోటీ చేస్తున్నారు. కుటుంబ రాజకీయ నేపథ్యం, అభివృద్ధి పనులు, అభిమానులు పరిటాలకు కలిసొచ్చేవి కాగా... ఓ సామాజికవర్గంలో వ్యతిరేకత, దూకుడు స్వభావం ఇబ్బంది కలిగించేవని శ్రేణులు భావిస్తున్నాయి. అయినా విజయం ఖాయమనే నమ్మకంతో ఉన్నారు. వైకాపా నుంచి తోపుదుర్తి ప్రకాశ్​రెడ్డి శ్రీరామ్​కు ప్రత్యర్థిగా ఉన్నారు. సామాజికవర్గం అండ, సానుభూతి గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక బలహీనత, గిట్టనివారిపై దాడులుచేయిస్తారని ప్రజల్లో వ్యతిరేకత ఉంది.
గుంతకల్‌... పోటీ ఫుల్​
గుంతకల్​లో పోటాపోటీగా ఉంది రాజకీయం. తెదేపా నుంచి ఆర్​.జితేంద్రగౌడ్ బరిలో ఉన్నారు. ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో సానుకూలత, ఐదేళ్లలో చేసిన అభివృద్ధి తనను గెలిపిస్తుందనే గట్టి నమ్మకంతో ఉన్నారు. ప్రత్యర్థితో పోలిస్తే ఆర్థిక బలం తక్కువగా ఉండటం, బలమైన సామాజికవర్గం అండ లేకపోవటంతో శ్రేణుల్లో ఆందోళన ఉంది. వైకాపా అభ్యర్థిగా... ఎల్లారెడ్డిగారి వెంట్రామిరెడ్డి పోటీ చేస్తున్నారు. బలమైన సామాజికవర్గం, ఆర్థిక బలం, ప్రజల్లో సానుభూతి కలిసొచ్చే అంశాలని శ్రేణులు భావిస్తున్నారు. వెంట్రామిరెడ్డిపై కొన్ని వర్గాల్లో ఉన్న వ్యతిరేకత, అందరికీ అందుబాటులో ఉండరనే విమర్శ నష్టం కలిగించవచ్చనే ప్రచారం జరుగుతోంది.
రాయదుర్గం... ఎవరికి రాజమార్గం..?
రాయదుర్గంలో తెదేపా నుంచి మంత్రి కాల్వ శ్రీనివాసులు పోటీ చేస్తున్నారు. మంత్రిగా చేసిన అభివృద్ధి, చంద్రబాబు పాలనపై ప్రజల్లో సానుకూలత తననే గెలిపిస్తాయని గట్టి నమ్మకంతో ఉన్నారు. కొందరు స్థానిక నేతల్లో అసంతృప్తి, ఓ ప్రధాన సామాజికవర్గంలో వ్యతిరేకత ఉంది. వైకాపా తరఫున కాపు రామచంద్రారెడ్డి బరిలో ఉన్నారు. ఆర్థిక బలం, పార్టీ, జగన్​పై ప్రజల్లో ఉన్న అభిమానం కలిసొస్తుందని భావిస్తున్నారు. ప్రధాన ప్రత్యర్థితో పోలిస్తే పరిచయాలు తక్కువ, ప్రచారంలో వెనకంజ ప్రతికూలాంశాలుగా భావిస్తున్నారు.
తాడిపత్రికి పోటీ ఎక్కువే...
తాడిపత్రిలో పోరు రసవత్తరంగా ఉంది. తెదేపా, వైకాపా, జనసేన, భాజపా, కాంగ్రెస్ అభ్యర్థులందరూ ఒకే సామాజికవర్గానికి చెందినవారు కావడంతో ఆసక్తి నెలకొంది. ఇక్కడ తెదేపా తరఫున జేసీ వారసుడు అశ్మిత్​రెడ్డికి కుటుంబ రాజకీయ నేపథ్యం, ఆర్థిక బలం అనుకూలం అంశాలు. రాజకీయాలకు కొత్తకావటం, తండ్రికి సహకరించినవారంతా సహకరిస్తారనే నమ్మకం లేకపోవడం ప్రతికూలంగా మారవచ్చేనే వాదన వినిపిస్తోంది. వైకాపా నుంచి కేతిరెడ్డి పెద్దారెడ్డి బరిలో ఉన్నారు. పార్టీ ప్రణాళిక, జగన్​పై ప్రజల్లో ఉన్న అభిమానం కలిసొస్తుందని నమ్మకంతో ఉన్నారు. బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి ప్రత్యర్థి ఉండటం, గతంలో అండగా ఉన్న సామాజికవర్గం ఓట్లు కోల్పోవటం ప్రతికూల ప్రభావం చూపొచ్చు.
సింగనమలను స్వీకరించేది ఎవరు..?
సింగనమలలోనూ పోరు రసవత్తరంగా మారింది. తెదేపా అభ్యర్థిగా బండారు శ్రావణి పోటీ చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తల బలం గెలిపిస్తుందన్న ధీమాతో ఉన్నారు. వైకాపా, కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఉండటం, ఆర్థిక బలం లేకపోవడంతో శ్రేణుల్లో ఆందోళన ఉంది. వైకాపా తరఫున జొన్నలగడ్డ పద్మావతి బరిలో నిలిచారు. పార్టీ బలం, ఓ ప్రధాన సామాజికవర్గం అండతో నెగ్గుతాననే నమ్మకంతో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి శైలజానాథ్ పోటీలో ఉన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి, విస్తృత పరిచయాలు తననే విజయతీరాన్ని చేరుస్తాయని విశ్వసిస్తున్నారు.

జిల్లాలో ఉన్న పట్టును పెంచుకోవడానికి అధికార తెదేపా పావులు కదుపుతుంటే... సీమలోని ఇతర జిల్లాల మాదిరిగానే అనంతలోనూ ఉనికి పెంచుకోవాలని వైకాపా ప్రత్నిస్తోంది. కిందటి ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిన అభ్యర్థులను ఎలాగైన గెలిపించుకోవాలని ఇరు ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. సింగనమల, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో హస్తం హవా చూపిస్తామంటూ కాంగ్రెస్ సవాలు చేస్తోంది. అనంత ప్రజలు ఏ పార్టీని అందలమెక్కిస్తారో అన్న చర్చ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతోంది.

ABOUT THE AUTHOR

...view details