ఈ ఏడాది పప్పుశెనగకు ప్రత్యామ్నాయంగా వేరే పంటలు వేసే దిశగా రైతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పలువురు రైతు సలహా మండలి సమావేశంలో సూచించారు. అనంతపురం కలెక్టరేట్ లో జరిగిన రైతు సలహా మండలి సమావేశంలో మంత్రి శంకరనారాయణ, ఎమ్మెల్యేలు, అధికారులు, వ్యవసాయ నిపుణులు పాల్గొన్నారు.
గత ఏడాది పప్పుశెనగ సాగు చేసిన రైతులు... అమ్ముకోలేక నష్టపోయిన పరిస్థితిని ప్రధానంగా ప్రస్తావించారు. ఈసారి ఆ పరిస్థితి లేకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సెప్టెంబర్ 15 నుంచి పప్పుశనగ సాగు చేయాల్సిన నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా ఆవాలు, పెసలు, మినుము తదితర పంటలను సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని సూచించారు. మరోవైపు వేరుశనగకు సమానమైన ఆదాయం వచ్చేలా ప్రత్యామ్నాయ పంటల సాగు తీసుకుని రావాల్సిన అవసరం ఉందని కొందరు రైతులు అభిప్రాయపడ్డారు. జిల్లాలో ఆహారశుద్ధి పరిశ్రమల స్థాపనకు వచ్చే పారిశ్రామికవేత్తలకు భూమి ఉచితంగా ఇచ్చేలా చూడాలని ఎమ్మెల్యేలు కోరారు. జిల్లాలో ఫుడ్ ప్రాసిసింగ్ యూనిట్ల స్థాపనకు అనేక అవకాశాలు ఉన్నాయని.. రానున్న వారం రోజుల్లో దీనిపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుందన్నారు.