అనంతపురం జిల్లాలో వేరుశనగ విత్తనాల కోసం రైతుల ఆందోళనలు ఆగలేదు... గుత్తి పట్టణంలో సబ్సీడీ వేరుశనగ విత్తన పంపిణీ చేయలంటూ రైతులు రోడ్డుపై ఆందోళన చేపట్టారు. వ్యవసాయ ఆధికారులు విత్తన పంపిణీలో జాప్యం వహిస్తున్నారంటూ మండల పరిధిలోని తొండపాడు, కొత్తపేట గ్రామాలకు చెందిన రైతులు పట్టణంలోని మార్కెట్ యార్డు వద్ద రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. వేరుశనగ విత్తనాలు ఇవ్వాలని వ్యవసాయ శాఖ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
గత వారం రోజుల నుంచి వ్యవసాయ మార్కెట్కు వస్తున్నా అధికారులు తమను పట్టించుకోవడం లేదని రైతులు వాపోయారు. వర్షాలు పడుతున్నా విత్తనాలు అందనందున రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు, రైతులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకొంది. వ్యవసాయ అధికారులు స్పందించి ధర్నాకు వచ్చిన రైతులకు ఖచ్చితంగా వేరుశెనగ విత్తనాలు ఇస్తామని హామీ ఇచ్చారు. స్టాకు లేకపోవడం వల్లే అన్ని గ్రామాల రైతులకు విత్తనం పంపిణీ చేయలేకపోతున్నామని తెలిపారు.